ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రైవేటు విద్యా సంస్థలలో లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన పదవ తరగతి, ఇంటర్ మీడియేట్ మొదటి, రెండవ సంవత్సర వార్షిక పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు ప్రారంభమయ్యాయి. వార్షిక పరీక్షల ప్రారంభ సమయంలో గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రైవేటు విద్యాసంస్థల వద్ద హృదయ విదారకదృశ్యాలు కనిపించాయి. ఫీజులు చెల్లించలేక, ఫీజులు చెల్లించేంతవరకు పరీక్షలు రాసేందుకు అవసరమైన హాల్ టికెట్లు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇవ్వక విద్యార్థులు అనేక మంది కన్నీటిపర్యంతమయ్యారు.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇటువంటి కడుదయనీయమైన దృశ్యాలు కంటిలో నీళ్ళు తెప్పిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిణామాలకు బాధ్యులుగా ఎవరిని నిందించాలి? వేలాది, లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేకున్నా, తమ పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చేర్పిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులనా? విద్యార్ధుల తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ముందు మాకు చెల్లించవలసినది చెల్లించి హాల్ టికెట్లు తీసుకెళ్లండి అని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజు బకాయి కోసం వ్యాపార దృక్పథంతో ఒత్తిడి చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలనా? గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఉద్భవించే ఇటువంటి పరిణామాలపట్ల చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలనా? 90 దశకం నుండి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నగర, పట్టణ, గ్రామస్థాయి వరకు ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు పుట్టగొడుగులుగా వ్యాపించాయి.
ఈ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులపై నిర్దిష్ట ప్రమాణాలు లేవు. అదే విధంగా ఏమాత్రం నియంత్రణా లేదు. ఒక్కో విద్యాసంస్థలో, ఒక్కో తరగతికి, ఒక్కో ఫీజు మొత్తం వసూలు చేస్తూ ఉండడం గమనార్హం. అయినా బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్న వారితో పాటూ ఎగువ, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ తాహతకు మించి తమ పిల్లలను ఈ కార్పొరేట్ విద్యాసంస్థలలో చేర్పిస్తున్నారు. కొంత మంది పేద ప్రజలు కూడా అనాలోచితంగా తమ శక్తికిమించి, తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలలో చేర్పించి ఇల్లూ, వళ్ళూ గుల్లచేసుకుంటున్నారు.
తమకన్నా తమ పిల్ల భవిష్యత్తు బాగుండాలి, ప్రైవేటు విద్యాసంస్థలలో చదివిస్తే పిల్లలకు బంగారు భవిష్యత్తు లభిస్తుంది అనే ఉద్దేశంతో పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో చేర్పిస్తున్నారు. పర్యవసానంగా తమ పిల్లల ఫీజులు చెల్లించేందుకు, చెల్లించలేకవారు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. అనేక మంది తమ ఆస్తులు అమ్ముకుంటున్నారు. కొంతమంది అప్పుల పాలవుతూ అవమానాల పాలవుతున్నారు. అదే విధంగా మరికొంత మంది తమ పిల్లలను నాణ్యమైన ఉన్నత చదువులు చదివించుకునేందుకు సొంత ఊర్లను, అయిన వారిని వదలి సుదూర ప్రాంతాలకు వలస వెళుతూ ఉన్నారు. అలా వెళ్ళినవారు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్పించి అష్టకష్టాలుపడుతూ చాలీచాలని ఆదాయంతో తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా తాము సంపాదిస్తున్న మొత్తాన్ని తమ పిల్లల ఫీజులకు, భవిష్యత్తుకే వెచ్చిస్తూ ఉంటారు.
ప్రైవేటు విద్యాసంస్థలలో చేర్పించే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల మొత్తం ఫీజులో కొద్దిగా మాత్రమే చెల్లిస్తారు. కాలక్రమేణా కొద్ది కొద్దిగా ఫీజ్ చెల్లిస్తూ విద్యా సంవత్సరం చివరిన వార్షిక పరీక్షల సమయంలో మొత్తం ఫీజు చెల్లిస్తారు. కొద్దిమంది వార్షిక పరీక్షల సమయంలో కూడా ఫీజులు చెల్లించలేకపోతారు. అలా ఫీజు చెల్లించనివారి పిల్లలను వార్షిక పరీక్షలకు కూర్చోబెట్టమని బెదిరిస్తూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నానాయాగీ చేస్తాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటూ, విద్యార్ధులూ తీవ్ర మనోవ్యథకు గురి అవుతూ వారు అనుభవించే బాధ వర్ణనాతీతం. అత్యధిక భాగం విద్యాసంస్థలు ఫీజుల కోసం స్వయంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ ఉండడంతో విద్యార్ధుల జీవితాల పురోభివృద్ధికి అత్యంత అవశ్యకమైన పది, ఇంటర్ మీడియేట్ చివరి సంవత్సరపు పరీక్షలు రాసే విద్యార్థులు అనేక మంది డిప్రెషన్‌లోకి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
తోటి విద్యార్ధుల ముందు విద్యాసంస్థల ఫీజు కోసం ఒత్తిడి చేయడంతో అవమానంగా భావించిన విద్యార్ధులు కొందరు అక్కడక్కడా ఆత్మహత్యాయత్నాలు చేసుకున్న దృశ్యాలు కూడా ఇటీవల కనిపించడం చాలా బాధాకరం. వేలు, లక్షల రూపాయలు ఉన్న ఫీజు మొత్తంలో కేవలం 10 వేలు, 20 వేల రూపాయలు బకాయిలు ఉన్న విద్యార్థులను కూడా వార్షిక పరీక్షలకు కూర్చోబెట్టేందుకు, హాల్ టికెట్లు ఇచ్చేందుకు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను తీవ్రఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ విద్యాసంస్థలలో ఉంటాయి. వార్షిక పరీక్షలు అయిన వెంటనే విద్యా సంస్థనుంచి పోయేటప్పుడు విద్యార్థికి కచ్చితంగా ఆ సర్టిఫికెట్లు కావాలి.
ఆ సమయంలో కూడా బకాయి ఉన్న ఫీజును విద్యాసంస్థలు రాబట్టుకోవచ్చు. కానీ ఈ సమయం మించిపోతే ఫీజు రాదు అన్నట్లుగా వార్షిక పరీక్షల సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలు కాల్‌మనీ సంస్థలుగా వ్యవహరిస్తూ విద్యార్ధులనుంచి ఫీజు బకాయీలు వసూలు చేస్తూ ఉండడం శోచనీయం. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, అవమాన భారంతో తమ పిల్లల ఫీజు బకాయిలకోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేస్తున్న దురాగతాల విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుం డా విద్యార్థ్ధుల తల్లిదండ్రులు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ స్పష్టంగా తెలిసినా నాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి విభక్త తెలుగు రాష్ట్రాలలోని పాలకులు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కచ్చితంగా చెప్పవచ్చు. ఉభయ రాష్ట్రాలలోని ప్రతి రాజకీయ పార్టీనుంచి అనేకమంది కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వాలలో భాగస్వాములుగా చలామణి అవుతుండడమే ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వాల ఉదాసీనతకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.