చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్‌బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం డొమినికాకు ప్రైవేటు జెట్ విమానాన్ని పంపించింది. ఈ ఈ విషయాన్ని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనే ఆదివారం ఓ రేడియో షోలో ధృవీకరించారు. చోక్సీ తరలింపునకు సంబంధించి అనుమతిని పొందే వేలాది డాక్యుమెంట్లతో భారత అధికారులు ఈ విమానంలో వచ్చారని వెల్లడైంది. కరిబియన్ దీవుల దేశం అయిన డొమినాకలో చొక్సీ అక్రమ ప్రవేశం కేసులో అరెస్టు అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ దశలో ఆయన అక్కడికి చేరుకున్నారు. అయితే రూ 13,500 కోట్ల పంజాబ్ బ్యాంక్ స్కామ్ విషయంలో ప్రధాన నిందితుడు అయిన చోక్సీని అక్కడి నుంచి ఇండియాకు తరలించేలా సహకరించాలని ఇండియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. డొమినికా ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేటు విమానం నిలిచి ఉండటం శనివారం నుంచి కలకలం కల్గించింది. ఇది కేవలం చోక్సీని భారత్‌కు తీసుకువెళ్లేందుకు వచ్చిన జెట్ విమానం అని వెలువడ్డ వార్తలు నిజం అయ్యాయి.
అయితే చోక్సీ కోసం ప్రైవేటు జెట్‌ను అక్కడికి పంపించినట్లు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికార నిర్థారణ వెలువడలేదు. డౌగ్లాస్‌చార్లెస్ ఎయిర్‌పోర్టులో ఖతార్ ఎయిర్‌వేస్ ప్రైవేటు జెట్ నిలిచి ఉందని ఆంటిగ్వా వార్తా సంస్థలు తెలిపాయి. అంతకు ముందు ఆంటిగ్వా, బార్బూడాల నుంచి అంతుబట్టని రీతిలో అదృశ్యం అయిన చోక్సీ తరువాత గాయపడ్డ స్థితిలో పొరుగున ఉన్న డొమినాకా చేరారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పరారీ నేరస్తుల సంబంధిత అభియోగాలు తెలిపే సాక్షాధారాలు, పత్రాలు స్థానిక అధికారులకు చూపించి, నిర్థారణ ప్రక్రియను దాటుకున్న తరువాతనే నిందితుడిని విచారణకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 28న ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఖతార్ ఎక్సిక్యూటివ్ విమానం ఎ7సిఇఇ మధ్యాహ్నం 3.44కు బయలుదేరింది. అదేరోజు డొమినికాకు చేరుకుంది. స్థానిక విమానాశ్రయంలో నిలిచి ఉంది. నిందితుడిని భారత్‌కు తీసుకువచ్చేందుకు కాచుకుని ఉందని స్పష్టం అయింది. 62 ఏండ్ల భారత వ్యాపారి చొక్సీ ప్రస్తుతం కళ్లు ఎర్రగా వాచి, చేతులు, ముఖంపై గాయాల చారికలతో కన్పిస్తున్నారు.
తనను ఆంటిగ్వాలోని జోళీ హార్బర్ నుంచి పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, వీరిని ఆంటిగ్వా, భారత పోలీసు అధికారులుగా తాను గుర్తించానని చోక్సీ తెలిపారు. పిఎన్‌బి కేసులో చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోడీ నిందితులుగా ఉన్నారు. విదేశాలకు ఫరారు అయిన వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని బయటకు పంపించరాదని ఆయన తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ డొమినికా కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపి అక్కడి న్యాయస్థానం ఇటీవలే చోక్సీని భారత్‌కు తీసుకువెళ్లకుండా బుధవారం వరకూ స్టే వెలువరించింది. అయితే తక్షణం ఆయనను విచారణకు భారత్‌కు తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని తెలియచేసే పత్రాలతో ఏకంగా జెట్ విమానంతో భారత అధికారులు డొమినికాకు చేరడం కీలక పరిణామం అయింది.