బీహార్‌లో మహిళ రెండు కిడ్నీలు మాయం!
ప్రైవేట్ నర్సింగ్ హోంలో దారుణం
నిందితుల కోసం పోలీసుల గాలింపు
పాట్నా: ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక మహిళకు చెందిన రెండు కిడ్నీలను తొలగించారన్న ఆరోపణపై ఒక ప్రైవేట్ నర్సింగ్ హోం యజమానిని, డాక్టర్‌ను అరెస్టు చేసేందుకు బీహార్ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన బాధితురాలు సునీతా దేవి సెప్టెంబర్ 15 నుంచి పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఐజిఐఎంఎస్)లోని ఐసియులో డయాలసిస్ చేయించుకుంటున్నారు. సెప్టెంబర్ 3న గర్భసంచి తొలగింపు సర్జరీ చేయించుకునేందుకు ముజఫర్‌పూర్‌లోని శుభ్‌కాంత్ క్లినిక్ అనే గుర్తింపు లేని ఆసుపత్రిలో ఆమె చేరగా అక్కడ ఆమె రెండు కిడ్నీలను తొలగించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఐజిఐఎంఎస్ వైద్యులు మాత్రం ఆమె రెండు కిడ్నీలు మాయం అయ్యాయన్న విషయాన్ని నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గర్భసంచి తొలగింపు సర్జరీ తర్వాత నుంచి సునీతా దేవి కడుపు నొప్పితో బాధపడుతున్నారని, సెప్టెంబర్ 7న ఆమె శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె రెండు కిడ్నీలు తొలగింపునకు గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారని సక్ర పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ సరోజ్ కుమార్ తెలిపారు. నిందితులు శుభకాంత్ క్లినిక్ యజమాని పవన్ కుమార్, నకిలీ డాక్టర్ ఆర్‌కె సింగ్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆయన చెప్పారు. బాధితురాలు సునీత పరిస్థితి విషమంగా ఉందని ఐజిఐఎంఎస్ వైద్యులు తెలిపారు.
Private Nursing Home removed 2 kidneys of Bihari Woman