Sunday, January 19, 2025

ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పాటించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా విద్యాధికారి రేణుకాదేవి

వికారాబాద్ : ప్రైవేటు పాఠశాలలు కచ్చితమైన నిబంధనలు పాటించాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, ప్రిన్సిపాళ్లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు పాఠశాల తప్పనిసరిగా యాజమాన్యం బోర్డు, గవర్నింగ్ బాడీని నియమించుకోవాలన్నారు. బోర్డు సభ్యులు తప్పనిసరిగా నెలవారి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.

అదే విధంగా విధిగా తల్లిదండ్రులతో ప్రతినెలా తప్పనిసరిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. భద్రత, ఆరోగ్య, పరిశుభ్రతా కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సరియైన విధంగా ఇంటర్ నెట్ వాడకంపై అవగాహన కల్గించాలన్నారు. నియమ నిబంధనలకు లోబడి ఫీజులు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలో పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం అమ్మకూడదని ఆమె స్పష్టం చేశారు.

స్కూల్ బస్సులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలనీ, బస్సులో విద్యార్థుల పూర్తి రక్షణకై రోడ్ సైడ్ పాఠశాలలు తప్పని సరిగా రోడ్డుపై జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలన్నారు. పాఠశాల భవనాలు పూర్తి భద్రతతో కూడి ఉండాలని, ఓపెన్ కారిడార్ ఉన్న అంతస్థులలో గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా సంఖ్యకు తగిన విధంగా తరగతి గదులు ఉండాలని తెలిపారు.

తాగునీటి వసతి, పరిశుభ్రతా ఏర్పాట్లు, బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యం ఉండాలన్నారు. ప్రతి పాఠశాలలో సేఫ్టీ నోటీస్ బోర్డు ఉండాలని పేర్కొన్నారు. విద్యాబోధనకు డిఎడ్, బిఎడ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించుకోవాలని, నియమ నిబంధనలకు లోబడి వారి జీతభత్యాలు ఉండాలన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలకై ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకొని కచ్చితంగా అమలు చేయాలన్నారు. జూలై 1 నుంచి జూలై 31 వరకు పఠనోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ఇందులో భాగంగా జూలై 10 నుంచి జూలై 15 వరకు గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.

విద్యార్థులపై యూనిఫాం, టై, బెల్ట్, పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఫీజుల వల్ల అధిక ఆర్థిక భారం పడకుండా సేవా దృక్పథంలో పాఠశాలలు నడపాలని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News