రుసుం పెంచరాదు.. విద్యావ్యాపారం కుదరదు
చండీగఢ్ : పంజాబ్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల పెంపుదల ఉండరాదని ఆప్ ప్రభుత్వం ఆదేశించింది. తమ ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం తెలిపారు. వేసవి సెలవుల తరువాత ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల ఫీజులు తమ ఇష్టానుసారంగా పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ప్రవేశ రుసుం లేదా బోధనా రుసుంలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు స్కూళ్లు పెంచరాదని, లేకపోతే నిబంధనల మేరకు చర్యలు తప్పవని మాన్ ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలలో తెలిపింది. ఇతరత్రా కూడా విద్యారంగ సంబంధిత కీలక చర్యలను వెలువరించింది. పాఠశాల విద్యార్థులకు ఇతరత్రా ఏ కార్యక్రమాల బాధ్యతలు ఇవ్వరాదు. వారిని కేవలం విద్యాబోధనలకు పరిమితం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం ఇకపై ఫలానా షాపు నుంచే పుస్తకాలు , స్టేషనరీ కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టరాదని,ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకే వదిలిపెట్టాలని కూడా ఆదేశించారు. విద్యా వ్యాపార ఆధిపత్యాన్ని నిర్మూలించే దిశలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ సర్కారు కీలక నిర్ణయాలు చేపట్టింది.