యాదాద్రి భువనగిరి: రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మైత్రి ట్రావెల్స్ బస్సు- ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఓవర్ టేక్ చేసే సమయంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి సమయంలో మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ముందున్న వాహనాలు కనిపించడంలేదని వాహనదారులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వేగాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ టావెల్స్ బస్సు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమానులు నిర్ణీత సమయంలో ఎక్కువ ట్రిప్పులు వేయాలని నిర్ణయించడంతో డ్రైవర్లు ఇష్టారీతిగా డ్రైవింగ్ చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.