Sunday, December 22, 2024

పాలన చేతకాక కేంద్రంపై విమర్శలా?

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇలా కేంద్రం మీద గతంలో బిఆర్‌ఎస్ బురదజల్లిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ ఎలాగైతే వ్యవహరించారో అదే తరహాలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తుండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తెలంగాణ ప్రజలందరినీ అవమానించేలా ఉందని మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పించన్లు లేవు సరికదా పాత పింఛన్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఎన్ని హామీలిచ్చారు..? ఏం చేశారో చెప్పమంటే చేతకాదు కానీ బడ్జెట్ పేరు చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడతారా? అని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు ఏమీ మేలు జరగదని అన్నారు. సైనిక్ స్కూలు తెలంగాణలో రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. బయ్యారం విషయంలో అక్కడ లభించే ఐరన్ ఓర్ నాణ్యత అంత బాగాలేదని నిపుణులు అభిప్రాయాన్ని చెప్పారని అన్నారు. కేంద్రం ఇప్పటిదాకా పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలను పొందుపర్చారని అన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కోరాయని గుర్తు చేశారు. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం అంటే బ్లాక్ మెయిల్ చేయడమేనని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దాం, అమరణ దీక్షలు చేద్దామనడం వాళ్ల ఆలోచనను స్పష్టం చేస్తోందిదని అన్నారు. మోదీ సర్కారు ద్వారా పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే 35 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటా రూపంలో 2 లక్షల కోట్లు తెలంగాణకు బదిలీ చేసిందని, కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన విషయం వాస్తవం కాదా? అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే నిధులను దారిమళ్లించారని, ఉపాధిహామీకి నిధులిస్తే ఎమ్మెల్యేలకు పంపిణీ చేసి ఆ నిధులను దుర్వినియోగం చేశారని, పంచాయతీరాజ్ సంస్థలకు నిధులిస్తే వాటిని దారిమళ్లించారని ఆరోపించారు. కనీస అవసరాలు, మౌలికవసతుల కల్పనకుఈ నిధులు వెచ్చించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు.

సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదు
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై వివరణ ఇవ్వాలని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ కోరారు. ఇందుకు కిషన్‌రెడ్డి జవాబిస్తూ సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించేది లేదని తెగేసి చెప్పారు. ఒడిశాలో తాము రాగానే మైనింగ్ కోసం అనుమతిచ్చామని వెల్లడించారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని, తమ లక్ష్యంలో కూడా అది లేదని వివరణ ఇచ్చారు. సింగరేణికి పదేళ్ల నుంచి ఎలాంటి మైనింగ్ ఇవ్వలేదని, కానీ ఒడిశాలో తమ బీజేపీ ప్రభుత్వం రాగానే మైనింగ్ కోసం అనుమతులు మంజూరు చేశామని గుర్తు చేశారు.

సింగరేణిపై నరేంద్రమోదీ ప్రభుత్వానికి కమిట్‌మెంట్ ఉందన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ బొగ్గుగనిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని లోక్‌సభ సాక్షిగా కిషన్‌రెడ్డి ప్రకటించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలంటే సంస్థలో 51 శాతం వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమే కీలకమని నొక్కి చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అంశం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ పొరుగు రాష్ట్రం ఒడిషాతో చర్చించి సింగరేణికి ఒక బొగ్గు గనిని కేటాయించామని తెలిపారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News