Monday, December 23, 2024

అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల టోకరా

- Advertisement -
- Advertisement -

అధిక వడ్డీ ఇస్తామని డిపాజిట్లు చేయించుకుని నిండాముంచిన సంఘటన అబిడ్స్ వేదికగా చోటుచేసుకుంది. దాదాపుగా 517మంది వద్ద నుంచి రూ.200కోట్లు వసూలు చేసిన నిందితులు పత్తాలేకుండా పరారయ్యారు. దీంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల, తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షతో అబిడ్స్‌లో శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేయించింది.తాను పనిచేస్తున్న కార్యాలయంలో సమీపంలోనే ఏర్పాటు చేయించింది. కోఆపరేటివ్ బ్యాంక్‌లో వడ్డీకి డిపాజిట్ చేయాలని వచ్చేవారికి ఇక్కడ తక్కువ వడ్డీ వస్తుందని, శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో ఎక్కువ వడ్డీ ఇస్తారని చెప్పేది. ఇలా పలువురు డిపాజిటర్లను తన భర్త ఏర్పాటు చేసి సంస్థలో డబ్బులు డిపాజిట్ చేసే విధంగా చేసేది.

బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో నమ్మిన పలువురు డిపాజిటర్లు అధిక వడ్డీ వస్తుందని ఆశపడి శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.200కోట్లు డిపాజిట్ చేశారు. ప్రతి నెల బాధితులకు వడ్డీ ఇచ్చేవారు, కొంత కాలం నుంచి డబ్బులు ఇవ్వడం మానివేశారు. డిపాజిట్ చేసిన గడువు ముగిసినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు గత కొంత కాలం నుంచి వారి చుట్టు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే నిందితులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో చాలామంది పేదవాళ్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఎంత కాలం నుంచి పొదుపు చేసిన డబ్బులు అధిక వడ్డీ వస్తుందని డిపాజిట్ చేశామని, ఇప్పుడు వారు పరార్ కావడంతో నిండామునిగామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నెల ఉద్యోగ విరమణ…
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న వాణిబాల ఈ నెల ఉద్యోగ విమరణ చేయనుంది. ఈ క్రమంలోనే కుటుంబం మొత్తం కలిసి పెద్ద ప్లాన్ వేసి పరారయ్యారు. జనవరి వరకు డిపాజిటర్లకు వడ్డీ ఇచ్చిన నిందితులు తర్వాత నుంచి వడ్డీ ఇవ్వడం ఆపివేశారు. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి నిందితుడి భార్య గురించి తెలుసుకోగా, ఆమె బ్యాంక్‌కు రావడంలేదని, ఈ నెల ఉద్యోగ విరమణ ఉందని, ఇక బ్యాంక్‌కు రాదని అక్కడి ఉద్యోగులు చెప్పడంతో డిపాజిటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వడ్డీ ఇవ్వడం ఆపివేసినప్పటి నుంచి డిపాజిటర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మే 3వ తేదీ నుంచి నేతాజీ, వాణిబాల, శ్రీహర్ష మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు.

సహకరించిన సిబ్బంది….
అపెక్స్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల తన కింద పనిచేస్తున్న సిబ్బందిని కూడా వాడుకున్నారు. సిబ్బందితో డిపాజిటర్లకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పించడంతో ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో చాలామందితో డిపాజిట్ చేశారు. 15 నుంచి 20శాతం వడ్డీ ఇస్తామని చెప్పడంతో చాలామంది డబ్బులు డిపాజిట్ చేశారు.
భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని….
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో భార్య ఉన్నతాధికారి కావడంతో నేతాజీ దానిని వాడుకున్నాడు. ఆమె ద్వారా పలువురిని తన కంపెనీలో డిపాజిట్ చేసేలా చేసుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బులను పలు ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశాడు. భార్య రిటైర్‌మెంట్‌కు నెల ముందుగా ప్లాన్ వేసి డబ్బులతో కుటుంబం మొత్తం పారిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News