ప్రధాని మోడీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనున్న డిజిపిల సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాతో కలసి వేదికను పంచుకోవద్దంటూ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విజ్ఞప్తి చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ శుక్రవారం ప్రధాని మోడీ చేసిన ప్రకటనను గుర్తు చేసిన ప్రియాంక లఖింపూర్ ఖేరీ హింసాత్మక సంఘటనలో నిందితుడి తండ్రి అయిన అజయ్ మిశ్రాను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
శనివారం నాడిక్కడ డిజిపిల సమావేశం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ప్రధానికి తాను రాసిన లేఖను ప్రియాంక విలేకరుల సమక్షంలో చదివి వినిపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే స్వచ్ఛమైన మనసుతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ జాతినుద్దేశించి చెప్పారని, అదే నిజమైతే లఖింపూర్ ఖేరీ మృతుల కుటుంబాలకు న్యాయం చేయడమే ఆయన ప్రథమ ప్రాధాన్యత కావాలని ప్రియాంక అన్నారు. కాగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలసి అజయ్ మిశ్రా డిజిపిల సమావేశంలో పాల్గొన్న ఫోటోలను యుపి కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ లఖింపూర్ హింస అనంతరం రైతులను అజయ్ మిశ్రా స్వయంగా బెదిరించారని, ఇలాంటి పరిస్థితులలో రైతులకు న్యాయం ఎలా లభిస్తుందని ప్రశ్నించింది.