బనస్‌కాంత: ప్రధాని నరేంద్రమోడీ తన సోదరుడు రాహుల్ గాంధీని యువరాజుగా పదేపదే సంబోధిస్తుండటంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజల కోసం రాహుల్ 4000 కిమీ పాదయాత్ర చేస్తే, ప్రధాని మోడీ తన రాజభవనం లో కూర్చుని రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదని గుజరాత్ లోని బనస్‌కాంతలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. “నా సోదరుడిని ఆయన షెహజాదా అని పిలుస్తారు. నా సోదరుడు 4 వేల కిలీమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మరోవైపు, మన చక్రవర్తి నరేంద్రమోడీ రాజభవనాల్లో ఉంటారు.
నిస్సహాయ రైతులు, మహిళల అవస్థలు ఆయనకు ఏ విధంగా అర్థమవుతాయి? అధికారం ఆయన చుట్టూ ఉంది ఆయన చుట్టూ ఉండేవాళ్లు ఆయనను చూసి భయపడిపోతుంటారు. ఎవరైనా ఒకవేళ తన గొంతు వినిపించాలనుకున్నా వారి గొంతు అణగదొక్కేస్తుంటారు” అని ప్రియాంక చెప్పారు. ప్రధాని బడా వ్యక్తుల గురించే పట్టించుకుంటారు కానీ, సామాన్య ప్రజానీకం గోడు ఆయనకు అక్కర లేదని ప్రియాంక విమర్శించారు. గుజరాతీ ప్రజలు మోడీని గౌరవించి ఆయనకు అధికారం కట్టబెట్టారని, కానీ ఆయన బడా వ్యక్తుల గురించే ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు.
మోడీ కనీసం ఒక్క రైతునైనా కలుసుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? వారిని కలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎన్నికలు ముంచుకొచ్చి, తమకు ఓట్లు రావని తెలుసుకున్న తర్వాత ప్రధాని మోడీ చట్టాలను మారుస్తామంటున్నారని ఆక్షేపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని ప్రియాంక ఆరోపించారు. “ ప్రజలకు రాజ్యాంగం హక్కులు ప్రసాదించింది. అన్నిటికంటే పెద్ద హక్కు ఓటు హక్కు. రిజర్వేషన్ హక్కుతోపాటు ప్రశ్నించేహక్కు. ఆందోళన చేసే హక్కు దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించింది. అందువల్లే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది కచ్చితంగా ప్రజల హక్కులను ఊడలాక్కోవడమే అవుతుంది ” అని ప్రియాంక విమర్శించారు.