కిసాన్ మహాపంచాయత్‌లో ప్రియాంక
లక్నో : ప్రధాని మోడీ ఓ పిట్టకథలోని అహంకారి రాజాగా మారారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. యుపిలోని ముజఫర్‌నగర్‌లో వేలాది మంది హాజరైన కిసాన్ మహా పంచాయతీలో శనివారం ప్రియాంక మాట్లాడారు. అహంకారి రాజాకు నిజాలు తెలియవని, రాజభవనానికి పరిమితం అన్నట్లుగా ఉంటాడని, ప్రస్తుతం మోడీ స్థితి కూడా ఇదేనని ప్రియాంక ఓ కథ చెప్పారు. దేశాన్ని భద్రంగా కాపాడే జవాను కూడా ఓ రైతు బిడ్డనే అనే విషయం మోడీ గ్రహించలేకపోతున్నారని ప్రియాంక విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల మొదలుకుని పలు అంశాలపై ప్రియాంక ప్రధాని వైఖరిపై మండిపడ్డారు. ఓ వైపు రైతులు కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారని, అయితే ఇవి ఆయన చెవిసోకడం లేదన్నారు. ఆయన ఎప్పుడూ తన సొంతం, అంతకు మించి తన బిలియనీర్లు అయిన స్నేహితుల బాగుకే పాటుపడుతారని చెప్పారు. కేవలం సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనే ఉండే రాజు ప్యాలెస్‌లోనే ఉండి నిజాలు మరిచి వ్యవహరిస్తుంటాడని తెలిపారు.
అహంకారి రాజా ముందు ఎవరూ నిజాలు చెప్పలేరు. తాను ఏదంటే అదే అనే తరహాలో తన చుట్టూ ఉండాలని కథలో రాజు అనుకుంటాడని, ఇటువంటి అహంకారపు రాజు ఇప్పుడు ప్రధాని మోడీ అని విమర్శించారు. రైతుల ఉద్యమం గురించి స్పందిస్తూ కొత్త చట్టాలు అమలులోకి వస్తే ఇప్పటివరకూ ఉన్న మండీలు, కనీస మద్దతు ధరలకు భద్రత అంతా కొట్టుకుపోతుందని తెలిపారు. రైతుల హక్కులు అంతం అవుతాయని, ఇప్పటికే ప్రధాని ఈ దేశాన్ని తన ఇద్దరు ముగ్గురు స్నేహితులకు దోచిపెట్టారని, దీనిని కొనసాగిస్తూ రైతులను కూడా వారికి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. రైతులు వారి భూములు, వారి సాగు రాబడి అంతా క్రమేపీ బిలియనీర్ల చేతబడి హరించుకుపోతాయని హెచ్చరించారు.