Sunday, December 22, 2024

విద్యా వ్యవస్థను ‘మాఫియా’కు అప్పగించారు: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి సహాజాతీయ పోటీ పరీక్షల్లో అవకతవకలపై నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం తూర్పారబట్టారు. మోడీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను ‘మాఫియా’కు, ‘అవినీతిపరులకు’ అప్పగించిందని ఆమె ఆరోపించారు. పరీక్షల నిర్వహణ బాధ్యత వహించే జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) పని తీరును సమీక్షించి, పరీక్ష సంస్కరణలు సిఫార్సు చేసేందుకు ఒక బృందాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన మరునాడు ప్రియాంక గాంధీ ఆ విధంగా స్పందించారు, కేంద్రం శనివారం ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌కు ఉద్వాసన పలకడమే కాకుండా నీట్ యుజి వైద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తును సిబిఐకి అప్పగించింది. నీట్ యుజి ప్రశ్న పత్రం ‘లీకైంది’ అని, నీట్‌పిజి, యుజిసినెట్, సిఎస్‌ఐఆర్‌నెట్ పరీక్షలు ‘రద్దు చేశారు’ అని ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు, ‘దేశంలో ఇప్పుడు కొన్ని పెద్ద పరీక్షల స్థితి ఇది.

బిజెపి పాలనలో మొత్తం విద్యా వ్యవస్థను మాఫియాకు, అవినీతిపరులకు అప్పగించారు’ అని ఆమె హిందీ పోస్ట్‌లో ఆరోపించారు. ‘దేశంలో విద్యను, పిల్లల భవిష్యత్తును స్వార్థపరులైన, వందిమాగధులైన అసమర్థులకు అప్పగించడంలో రాజకీయ మొండితనం, అహంకారం వల్ల ప్రశ్న పత్రాల లీక్‌లు, పరీక్షల రద్దు, క్యాంపస్‌ల నుంచి విద్య అదృశ్యం, రాజకీయ గూండాగిరీ మన విద్యా వ్యవస్థకు గుర్తింపుగా మారాయి’ అని ప్రియాంక అన్నారు, బిజెపి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఒక్క పరీక్షను కూడా నిర్వహించలేనంతగా పరిస్థితి మారిందని ఆమె ఆరోపించారు. ‘ఇప్పుడు బిజెపి ప్రభుత్వం యువత భవిష్యత్తుకు ఏకైక పెద్ద అవరోధంగా మారింది. దేశంలోని సమర్థులైన యువజనులు తమ అమూల్య కాలాన్ని, శక్తిని బిజెపి అవినీతిపై పోరాటానికే వ్యర్థం చేస్తున్నారు, నిస్సహాయ మోడీజీ ఒక ప్రేక్షకునిలా మిగిలిపోయారు’ అని ఆమె పేర్కొన్నారు. పిజి వైద్య కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నీట్ పిజి పరీక్షను ఆదివారం నిర్వహించవలసి ఉంది. కానీ, నీట్ యుజితో సహా కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ‘ముందు జాగ్రత్తచర్య’గా ఆ పరీక్షను వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News