Tuesday, September 17, 2024

అంబానీల ఇంట పెళ్లికి ప్రియాంక గాంధీ వెళ్లలేదు

- Advertisement -
- Advertisement -

ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హజరైనట్లు బిజెపి ఎంపి నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఖండించారు. ప్రియాంక గాంధీ ఆ వివాహానికి హారుకాలేదని, అసలు ఆ సమయంలో ఆమె దేశంలోనే లేరని వారు స్పష్టం చేశారు. నిషికాంత్ దూబే సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ అంబానీల ఇంట పెళ్లికి ప్రియాంక గాంధీ హాజరయ్యారంటూ అబద్ధాలు చెప్పారని కాంగ్రెస్ ఎంపి, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎక్స్ వేదికగా విమర్శించారు. అంతేగాక వేణుగోపాల్ లోక్‌సభలో ఈ అంశాన్ని మంగళవారం ప్రస్తావిస్తూ బిజెపి ఎంపీలకు అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిందని ఆరోపించారు. ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె కాంగ్రెస్ ఎంపి వాదనతో ఏకీభవిస్తూ ఒకవేళ ఆ పెళ్లి హాజరైనప్పటికీ తప్పేమిటని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోడీ కూడా అంబానీల ఇంట పెళ్లికి హాజరయ్యారని ఆమె తెలిపారు. బిజెపి ఎంపి నిషికాంత్ దూబే లోక్‌సభలో పచ్చి అబద్ధం ఆడారని ఆమె ఆరోపించారు. ప్రియాంక ఆ పెళ్లికి వెళ్లలేదని, ఆ సమయంలో ఆమె దేశంలోనే లేరని, ప్రతి ఒక్కరిని నీడలా వెంబడించే హోం మంత్రి(అమిత్ షా)కి ఈ విషయం తెలియకపోయే అవకాశమే లేదని కెసి వేణుగోపాల్ విమర్శించారు. నకిలీ డిగ్రీ పొందిన దూబేకు అబ్ధాలు చెప్పే రోగం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యురాలు కాని ప్రియాంక గాంధీ పేరును సభలో ప్రస్తావించడం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన విమర్శించారు. అబద్ధాలు చెప్పినందుకు నిషికాంత్ దూబే బహిరంగం క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన పేరును నిషికాంత్ దూబే కాక నిషికాంత్ ఝూటేగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అనంత్ అంబానీ వివాహానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా వెళ్లలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News