Sunday, December 22, 2024

35 ఏళ్లుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నా:ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

35 సంవత్సరాలుగా ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తున్నానని, ఇప్పుడు తన కోసం మద్దతు కోరడం మొదటిసారి అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం వెల్లడించారు. వయనాడ్ పార్లమెంటరీ సీటుకు రానున్న ఉప ఎన్నిక కోసం తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఒక బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. వేదికపై ఆమె చెంత తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ ఉన్నారు. వయనాడ్ సీటుకు ఇంతకు ముందు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఈ పర్యాయం కూడా ఈ స్థానంలో గెలిచారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి సీటును అట్టిపెట్టుకుని రాహుల్ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో ఆయన సోదరి ఎన్నికల రాజకీయాలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. ప్రియాంక గాంధీ సభలో ప్రసంగిస్తూ, ‘మా తండ్రి (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) కోసం నేను ప్రచారం చేసినప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. ఆ తరువాత మా తల్లి, సోదరుని కోసం, అనేక మంది పార్టీ సహచరుల కోసం ప్రచారం చేశాను.

35 సంవత్సరాలుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాను. కాని ఒక ఎన్నికలో నేను ప్రచారం చేసుకుంటూ, మీ మద్దతు కోరుతుండడం ఇదే మొదటిసారి. ఇది చాలా విభిన్న భావన’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు ఇచ్చినందుకు ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అవకాశం ఇస్తే మీకు ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవంగా ఉంటుంది’ అని ఆమె అన్నారు. కొండచరియలు కూలిపడిన దుర్ఘటన దరిమిలా వయనాడ్ జిల్లాలోని ముందక్కై, చురల్‌మలను తాను, రాహుల్ సందర్శించినట్లు ప్రియాంక తెలియజేశారు. ఆ దుర్ఘటనలో 400 మందికి పైగా మరణించగా వేలాది మంది నిర్వాసితులైన విషయం విదితమే. ‘ఆ బీభత్సాన్ని నా కళ్లతోచూశాను. తమ కుటుంబాలను కోల్పోయిన పిల్లలను చూశాను. తమ పిల్లలను కోల్పోయిన తల్లులను కలుసుకున్నాను. మొత్తం జీవితం తుడిచిపెట్టుకుపోయిన వారినీ కలుసుకున్నాను.

నేను కలుసుకున్న ప్రతి ఒక్కరూ పరస్పరం సాయం చేసుకుంటుండడం నన్ను ఆకట్టుకున్నది. వారు ఏమాత్రం స్వార్థం లేకుండా ఆప్యాయతతో, ధైర్యంతో పరస్పరం అండగా నిలబడ్డారు. మీ సమాజంలో భాగం కావడం నాకు ఎంతో గర్వకారణం’ అని ప్రియాంక చెప్పారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తన కోసం వయనాడ్ చేసింది తాను మాటలతో వర్ణించజాలనని అన్నారు. ‘వయనాడ్‌కు లోక్‌సభలో ఒక అధికార ఎంపి, ఒక అనధికార ఎంపి ఉంటారు. వారు ఇద్దరూ మీ సమస్యలను లేవనెత్తగలరు’ అని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ తన సోదరికి మద్దతు కోరుతూ, ‘వయనాడ్ ప్రజలతో నాకు గల అనుబంధాన్ని మీరు అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇద్దరు ఎంపిలు, ఒక అధికార ఎంపి, మరొకరు అనధికార ఎంపి ఉండే నియోజకవర్గం దేశంలో వయనాడ్ ఒక్కటే అని మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నా.

వయనాడ్ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు వారు కలసి పాటుపడతారు’ అని రాహుల్ చెప్పారు. పాత జ్ఞాపకాలను రాహుల్ ప్రస్తావిస్తూ, ‘మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తన స్నేహితులతో గడుపుతున్న నా సోదరిని గమనిస్తుండేవాడిని. ప్రియాంక! నీ స్నేహితుల అవసరాల కోసం నువ్వు అంత దూరం వెళ్లకు అని ఆమెతో చెబుతుండేవాడిని.ఆమె ఏమైనా చేయడానికి సుముఖంగా ఉంటుండేది. కొన్ని సార్లు ఆమె స్నేహితులు అది గుర్తించరు. ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావని ఆమెతో అంటుండేవాడిని. నేను కోరుకున్నందున చేస్తున్నానని, వారు గుర్తించకపోయినా ఫర్వాలేదని ఆమె అంటుండేద. తన స్నేహితుల కోసం ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి తన కుటుంబం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మా తండ్రి మరణించినప్పుడు నా సోదరి మా తల్లి బాగోగులు చూసుకున్నది. ఆమె వయస్సు 17 సంవత్సరాలు’ అని వివరించారు. ‘ఆమె స్నేహితులు, కుటుంబం గురించి నేను మీకు ఇదంతా ఎండుకు చెబుతున్నానని మీరు ఆశ్చర్యపోవచ్చు.

వయనాడ్ ప్రజలను తన కుటుంబంగా ప్రియాంక భావిస్తుండడమే అందుకు కారణం’అని రాహుల్ చెప్పారు. తనకు వయనాడ్ ప్రజల నుంచి ఒక కానుక అవసరమని ఆయన తెలిపారు. ‘ఆమె తయారు చేసిన రాఖీ నా చేతికి ఉంది. అది దెబ్బ తినేంత వరకు నేను దానిని తీయను. తన సోదరికి ఒక సోదరుని రక్ష అది. నా సోదరిని ఆదరించవలసిందని, కాపాడవలసిందని వయనాడ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాహుల్ చెప్పారు. ‘వయనాడ్ ప్రజల సేవ కోసం తన శక్తి అంతా ఆమె ధారపోస్తుంది. నేను అనధికార ఎంపిని అని మరవకండి, అందువల్లే ఇక్కదికి వచ్చి, కల్పించుకోగలిగా’ అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభలో ప్రసంగిస్తూ, ప్రియాంక గాంధీ వాద్రా బలమైన నాయకురాలు అని పేర్కొన్నారు. ఆమె వయనాడ్ ప్రజలు తమ విశ్వాసం ఉంచాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు. నవంబర్ 13న పోలింగ్ జరిగే 48 లోక్‌సభ నియోజకవర్గాలలో వయనాడ్ ఒకటి. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే వోట్ల లెక్కింపు 23న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News