భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాది లోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇందులో విపక్షాల తరఫున కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చర్చను ప్రారంభించారు. ఎంపీగా ఇటీవలే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఆమె, లోక్‌సభలో ప్రసంగం చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార బిజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేశారు. రాజ్యాంగం అంటే సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ ) బుక్ కాదని దుయ్యబట్టారు.
అన్నిటికీ నెహ్రూనే కారణమా ?
“ బీజేపీ ఎల్లప్పుడూ గతం గురించే మాట్లాడుతుంది. కానీ దేశ ప్రగతి కోసం ఇప్పుడేం చేస్తున్నారో వారు మాట్లాడాలి. దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా ? నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను మీరు పుస్తకాల నుంచి తొలగించగలరేమో .. కానీ స్వాతంత్య్ర పోరాటంలో , జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరు” అని ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా 2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార సంఘటనను ఆమె ప్రస్తావించారు.ఇలాంటి సంఘటనల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే కల్పించిందన్నారు.
అదానీ అంశం పైనా ..
ఈ సందర్భంగా అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “ ఒక్కరిని కాపాడటం కోసం 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ ఆయనకే ఇస్తున్నారు. ” అని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాడే ప్రతిపక్షాల గళాన్ని అణచివేసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్ష నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని మార్చేవారేమో…
“ ఇతర దేశాలతో పోలిస్తే మన స్వాతంత్య్ర పోరాటం ప్రత్యేకమైనది. సత్యం, అహింస అనే పునాదుల పైనే మనం పోరాడాం. మన స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం. దాన్నుంచి ఉద్భవించనదే రాజ్యాంగం. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు. అంబేద్కర్, మౌలానా అజాద్, రాజగోపాలాచారి, నెహ్రూ వంటి ఎంతోమంది నేతలు ఎన్నో ఏళ్లపాటు తమ జీవితాలను అంకితం చేసి దీన్ని రూపొందించారు.ప్రజా హక్కులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే శక్తిని రాజ్యాంగం మనకు కల్పించింది. ఇది దేశ ప్రజలను కాపాడే ‘ సురక్షా కవచం’ లా ఉంది. అయితే దీన్ని బద్దలు కొట్టేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది.
గత పదేళ్లలో ఈ రక్షణ కవచాన్ని బలహీనపర్చింది. లేట్రల్ ఎంట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే భావించింది. అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది. ఇది సంవిధాన్… సంఘ్‌రూల్ బుక్ కాదు.” అని కాంగ్రెస్ ఎంపీ దుయ్యబట్టారు. కులగణన జరగాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
రాహుల్ గాంధీ స్పందన..
ప్రియాంక గాంధీ తొలి ప్రసంగంపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక స్పీచ్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. చాలా విషయాలపై ఆమె అద్భుతంగా మాట్లాడారని అన్నారు. ప్రతి విషయాన్నీ సమగ్రంగా వివరించారని తెలిపారు.