వయనాడ్ ప్రజా ప్రతినిధిగా తన తొలి ప్రస్థానం ‘ప్రజా పోరాట యోధగా’ తనకు మొదటిది కాదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఉద్ఘాటించారు. రాజ్యాంగంలో పొందుపరచిన విలువలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడడం తన జీవితానికి ప్రధానం అని ప్రియాంక స్పష్టం చేశారు. వయనాడ్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక గాంధీ బహిరంగ లేఖ రాస్తూ, తాను వారితో సన్నిహితంగా పని చేస్తానని, వారి సవాళ్ల పరిష్కారంలో సాయం చేస్తానని హామీ ఇచ్చారు. నవంబర్ 19న జరిగే ఉప ఎన్నికలో ఎంపిగా తనను ఎన్నుకోవలసిందిగా ప్రజలకు ప్రియాంక విజ్ఞప్తి చేస్తూ, వారితో అనుబంధాన్ని సుదృఢం చేసేలా తన పని ఉంటుందని, వారి కోసం తాను పోరాడగలనని, పార్లమెంట్‌లో వారు ఆకాంక్షించిన రీతిలో ప్రాతినిధ్యం వహిస్తానని వాగ్దానం చేశారు.
ప్రజా ప్రతినిధిగా తనకు మొట్టమొదటిదైన ఈ ప్రస్థానంలో వయనాడ్ ప్రజలు ‘నా మార్గదర్శకులు, గురువులు’ కాగలరని ఆమె అన్నారు. ‘ప్రజా పోరాట యోధగా మొదటిది కాదు కానీ ప్రజా ప్రతినిధిగా నాకు మొదటిది కాగల ఈ ప్రస్థానంలో మీరు నాకు మార్గదర్శకులు, గురువులుగా ఉంటారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం, న్యాయం కోసం, మన రాజ్యాంగంలో పొందుపరచిన విలువల కోసం పోరాడడం నా జీవితానికి ప్రధానం. మీ మద్దతుతో మన అందరి భవిష్యత్తు కోసం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు చూస్తున్నాను, మీ ఎంపిగా నన్ను మీరు ఎంచుకున్నట్లయితే మీకు ఎంతగానో రుణపడి ఉంటాను’ అని ప్రియాంక తన లేఖలో తెలిపారు. తన సోదరుడు రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేసి, రాయబరేలి సీటును అట్టిపెట్టుకున్న తరువాత ఆమె ఈ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్ల నుంచి పోటీ చేశారు. ఆయన 2019 నుంచి 2024 వరకు ఈ సీటుకు ప్రాతినిధ్యం వహించారు.