దిస్పూర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం తేయాకు కార్మికురాలి అవతారమెత్తారు. బిశ్వనాథ్ జిల్లాలోని తేయాకు కార్మికులతో పాటు భుజానికి బుట్ట వేసుకుని కాసేపు తేయాకు ఏరారు. ఈ సందర్భంగా ఆమె కార్మికులతో ముచ్చటించారు. తేయాకు కార్మికుల జీవనశైలి నిరాడంబరంగా నిజాయతీతో కూడి ఉంటుంది. వారి కష్టం దేశానికి ఉపయోగపడుతోందని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. కాగా, సోమవారం ఆమె మాట్లాడుతూ.. బిజెపి తన వాగ్దానాలను నెరవేర్చలేదని, అటు మహిళల సమస్యలను పరిష్కరించ లేదన్నారు. రాజకీయ నాయకుల గురించి నిజం తెలుసుకున్న తర్వాతే ఓటు వేయామని ప్రజలను కోరారు. అస్సాంలో నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రారంభించిన ప్రియాంక, రాష్ట్రంలో 2.5 మిలియన్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బిజెపి పార్టీ 80,000 అవకాశాలను కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. “ఎన్నికల సమయంలో మీ ముందు వచ్చి నిలబడి వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులను మీరు గుర్తించడం చాలా ముఖ్యం. మీరు వారి సత్యాన్ని గుర్తించకపోతే మీ భవిష్యత్తును మార్చలేరు” అని ఆమె చెప్పారు. త్వరలో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
Priyanka Gandhi interacts with Assam tea workers