న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవన చర్యలు ప్రారంభించింది. పూర్వవైభవం కోసం తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగా ప్రియాంక గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పూర్తిస్థాయి ఇన్‌ఛార్జీ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్టీలో విభేదాలు, అంతర్గత కుమ్ములాటలున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి బాధ్యతలను అప్పగించారు. ప్రాంతీయ నాయకుల మధ్య సఖ్యతను సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ లో కూడా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సెప్టెంబర్ 7 నుంచి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టనుంది. ఈ యాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగనుంది. కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్ర ద్వారా బిజెపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.