Sunday, December 22, 2024

ప్రియాంక గాంధీకి రూ. 12 కోట్ల ఆస్తులు

- Advertisement -
- Advertisement -

వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన ఆస్తులను రూ. 12 కోట్లుగా ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని రూ. 46.39 కోట్లుగా తన నామినేషన్ పత్రాలలో ప్రియాంక ప్రకటించారు. ఇందులో అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకులు, ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే వడ్డీని కూడా ఆమె కలిపారు. నామినేషన్ పత్రాలతోపాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రియాంక తన చరాస్తుల విలువ రూ. 4.24 కోట్లుగా ప్రకటించారు. వీటిలో మూడు బ్యాంకు కాతాలలో ఉన్న డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లోని పెట్టుబడులు, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సిఆర్‌వి కారు, రూ. 1.15 కోట్ల విలువచేసే 4400 గ్రాముల బంగారం ఉన్నాయి.

ఆమె స్థిరాసుల విలువ రూ. 7.74 కోట్లు ఉండగా ఇందులో రెండు న్యూఢిల్లీకి చెందిన మెహ్రోలీ ప్రాంతంలో వ్యవసాయ భూమిలో వారసత్వ వాటా, వ్యవసాయ క్షేత్రంలోని భవనంలో సగం వాటా, ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 2.10 కోట్లని ఆమె పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంటి విలువ రూ. 5.63 కోట్లు ఆమె చూపారు. తన భర్త రాబర్ట్ వాద్రా స్థిర చరాస్తులను కూడా ప్రియాంక తన అఫిడవిట్‌లో పొందుపరిచారు. రాబర్ట్ వాద్రాకు రూ. 37.9 కోట్లకు పైగా విలువైన చరాస్తులు, రూ. 27.64 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సండర్‌ల్యాండ్ నుంచి దూరవిద్య ద్వారా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమా ఇన్ బుద్ధిస్ట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బిఎ హానర్స్ డిగ్రీని తన విద్యార్హతలుగా ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనకు రూ. 15.75 లక్షల అప్పులున్నట్లు ఆమె పేర్కొన్నారు.

2012-13 సంవత్సరానికి ఆదాయం పన్ను శాఖ రిఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్‌ను తాను ఎదుర్కొంటున్నానని, దీని ప్రకారం తాను రూ. 15 లక్షలను పన్నులుగా చెల్లించాల్సి ఉంందని ప్రియాంక తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపైన రెండు ఎఫ్‌ఐఆర్‌లు, ఒక అటవీ శాఖ నోటీసు ఉన్నట్లు ఆమె ప్రకటించారు. తప్పుదారి పట్టించే ట్వీట్లు చేసినట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి చేసిన ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లో తనపై చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద 2023లో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ఆమె తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2020లో హత్రాస్ ఘటనకు నిరసనగా తాను నిరసన తెలియచేసినందుకు ఉత్తర్ ప్రదేశ్‌లో తనపై కేసు నమోదైనట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News