న్యూఢిల్లీ/లక్నో: కర్నాటకలో ఉద్రిక్తంగా మారిన హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నేత, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం స్పందించారు. అది బికినీ అయినా, ఘూంఘట్(తలపై కొంగు కప్పుకోవడం) అయినా, జీన్స్ లేదా హిజాబ్ అయినా.. తన వస్త్రధారణను నిర్ణయించుకునే హక్కు మహిళకుంటుందని ప్రియాంక స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కని ఆమె నొక్కి చెప్పారు. మహిళలను వేధించడం ఆపండి అంటూ కర్నాటకలో హిజాబ్ నిషేధంపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. లడకీహూలడ్‌సక్తీహూ(ఆడపిల్లను పోరాడగలను అని దీని అర్థం) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉపయోగిస్తూ ప్రియాంక ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..బుధవారం లక్నోలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రియాంక గాంధీ తాను ఏ వస్త్రం ధరించాలో నిర్ణయించుకునే హక్కు మహిళకు ఉంటుందని పునరుద్ఘాటించారు. హిజాబ్‌పై అసలు చర్చ ఎవరు మొదలుపెట్టారని ఆమె ప్రశ్నించారు. మహిళలు ఎటువంటి వస్త్రాలు ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలకు తావు లేదని ఆమె చెప్పారు. మీరు ధరించిన స్కార్ఫ్ తీసేయండని నేను చెప్పవచ్చా అంటూ ఒక జర్నలిస్టును ప్రియాంక ప్రశ్నించగా తాను స్కూలులో లేనని, ఇది విలేకరుల సమావేశమని ఆ జర్నలిస్టు జవాబిచ్చారు. ఇదే తాను కూడా చెబుతున్నానని, మహిళను ఈ వస్త్రధారణ చేయకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు.
Priyanka Gandhi reacts on Hijab issue