పదేళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అని.. వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయమని ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భువనగిరిలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోట్ల రద్దు, కరోనా, జిఎస్టీ.. ఇలా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..
బీఆర్ఎస్ సర్కార్ కు ప్రజల సమస్యలపై అవగాహన లేదని మండిపడ్డారు. ప్రజలకు సహాయం చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. కష్టాల సమయంలో మిమ్మల్ని బీఆర్ఎస్ సర్కార్ ఆదుకోలేదని అన్నారు.
ఉద్యోగాలు కావాలన్న యువత కలలను నెరవేర్చలేదని.. రాష్ట్రంలో రోజూ అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారని అన్నారు.తెలంగాణ కోసం పోరాటం చేసిన యువతకు న్యాయం జరగలేదని అన్నారు. ట్రిబుల్ ఆర్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. ఆర్ఆర్ఆర్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రియాంక హామీ ఇచ్చారు.