Thursday, December 26, 2024

పార్లమెంట్‌లో ఇక ప్రియాంకం

- Advertisement -
- Advertisement -

వయనాడు: కేరళలోని వయనాడు పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇక్కడి నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ అసాధారణ విజయం సాధించారు. వయనాడులో తన సోదరుడు రాహుల్ గాంధీ గతంలో సాధించిన మెజారిటీని కూడా బ్రేక్ చేశారు. 4,10,931 ఓట్ల మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. ప్రియాంక గాంధీకి మొత్తంగా 6,22,338 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన సత్యన్ మొకేరికి 2,11,407 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ కేవలం 1,09,939 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసి వియం సాధించడంతో, వయనాడు స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో వయనాడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే వయనాడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ బరిలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ప్రచార సభల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం మాత్రం ఇదే తొలిసారి. లోక్‌సభ ఎన్నిక ల్లో వయనాడు నుంచి పోటీచేసిన రాహుల్ 6,47,445 ఓట్లు సొం తం చేసుకుని.. 3,64,422 ఆధిక్యంతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీ ఆ మెజారిటీని బ్రేక్ చేసి విజయం సాధించడం విశేషం.

పార్లమెంట్‌లో మీ గొంతుక వినిపిస్తా : ప్రియాంక
వయనాడులో తన విజయంపై ప్రియాంక గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వయనాడు ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తాను కృతజ్ఞతతో పొంగిపోయానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ‘వయనాడ్‌లోని నా ప్రియమైన సోదరీమణులు, సోదరులారా.. మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. కాలక్రమేణా ఈ విజయం మీ విజయమని మీరు నిజంగా భావించేలా చేస్తాను. మీకు ప్రాతినిధ్యం వహించడానికి మీరు ఎంచుకున్న వ్యక్తి మీ ఆశలు, కలలను అర్థం చేసుకుంటుంది. మీ కోసం పోరాడుతుంది. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నాను!. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు, మీరు నాకు ఇచ్చిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు‘ అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News