Sunday, December 22, 2024

బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శనివారం ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ప్రధాని నరేంద్ర మోడీని లక్షంగా చేసుకున్న ఆమె మోడీని మెహంగాయి(ద్రవ్యోల్బణం) మ్యాన్‌గా అభివర్ణించారు. వల్సద్ జిల్లాలోని గిరిజన ప్రాబల్యం ఉన్న ధరంపూర్ గ్రామంలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి అనంత్ పటేల్‌కు మద్దతుగా శనివారం జరిగిన ఎన్నికల ప్రచారం సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ రాజ్యాంగాన్ని మార్చివేస్తామంటూ బిజెపి నాయకులు, అభ్యర్థులు ఒక ప్రక్క ప్రకటిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మరోపక్క దాన్ని ఖండిస్తున్నారని చెప్పారు. ఇదంతా వారి ఎత్తుగడని ఆమె వ్యాఖ్యానించారు. తాము చేయదలచుకున్న పనిని ఖమొదట ఖండించడం వారికి అలవాటేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తారని ఆమె తెలిపారు. సామాన్యులకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను హరించివేసేందుకు రజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ఆలోచిస్తోందని ఆమె ఆరోపించారు.

ఎన్నికలు వచ్చినపుడు సూపర్‌మ్యాన్‌లాగా మోడీ ప్రవేశిస్తుంటారని, ఆయనను మ్రెహంగాయి మ్యాన్‌గా గుర్తుంచుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మంత్రి మోడీని గొప్ప శక్తిమంతుడిగా బిజెపి నాయకులు చిత్రీకరిస్తుంటారని, మెడీ చిటెకేస్తే యుద్ధం ఆగిపోతుందంటూ గొప్పలు చెబుతుంటారని ఆమె ఎద్దేవా చేశారు. అంతటి శక్తిమంతుడైతే చిటికేసి దేశంలో పేదరికాన్ని ఎంతుకు అంతం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గిరిజన ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, మహిళలపై హింస, అత్యాచారాలు వంటి సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారని ప్రియాంక ప్రశ్నించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రరిష్కారాలు చూపిందని ఆమె తెలిపారు. ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ ప్రాంతాలలో కూడా ఒక పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందని, పట్టణ ప్రాంతాలలోని పేదలకు 100 రోజుల ఉపాధి హామీ లభిస్తుందని ఆమె చెప్పారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తుందని ఆమె ప్రకటించారు.

సంపద పంపిణీపై ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై పదేపదే చేస్తున్న ఆరోపణలను ఆమె ప్రస్తావిస్తూ ఎక్స్‌రే మిషన్‌తో కాంగ్రెస్ ప్రతి ఇంటికి వెళ్లి సోదాలు చేసి మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని కూడా లాగేసుకుని వేరేవారికి పంచిపెడుతుందని మోడీ అంటున్నారని, ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ ఆమె ప్రశ్నించారు. విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల గురించి మోడీ మాట్లాడరని, ఓటమి భయంతోనే హిందూ-ముస్లిం సమస్యలను ఆయన లేవనెత్తుతున్నారని ప్రియాంక ఆరోపించారు. ప్రజలకు ఉపాధి లేదా మంచినీరు కల్పించలేని ప్రధాని మోడీ వల్సద్‌కు వస్తే క్షమాపణ చెప్పాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే మొట్టమొదటి ప్రధాని మోడీ అని ఆమె ఆరోపించారు. తన తల్లిని, నానమ్మను, తాతను, సోదరుడిని(రాహుల్), తన భర్తను దుర్భాషలాడారని, కాని తాము వాటిని పట్టించుకోబోమని ఆమె స్పష్టం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని సభ్యతా సంస్కారాలు తెలిసిన నాయకుడిగా ఆమె కీర్తించారు. మే 7న మూడవ దశలో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News