Monday, December 23, 2024

మోడీజీ.. తిట్లకే భయపడితే ఇక మీరేం నేతలు

- Advertisement -
- Advertisement -

మోడీజీ …తిట్లకే భయపడితే ఇక మీరేం నేత
రాహుల్ దేశం కోసం బుల్లెట్లకూ సిద్ధం
కర్నాటక ఎన్నికల సభలో ప్రియాంక
ప్రజల గోడు వింటారా? గోడు చెపుతారా?
జాంకండి : ప్రధాని మోడీ ఇకనైనా సోదరుడు రాహుల్‌ను చూసి ఎంతైనా నేర్చుకోవల్సి ఉందని ప్రియాంక గాంధీ హితవు పలికారు. ఆదివారం ప్రియాంక గాంధీ బాగల్‌కోట్ జిల్లాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని మోడీ కర్నాటకలో ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ తరచూ కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు తిట్టిపోశారని చేసిన విమర్శలపై ప్రియాంక స్పందించారు. ప్రజా జీవితంలో ఉన్న వారు తిట్లను భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నా సోదరుడు రాహుల్‌ను చూసైనా నేర్చుకోండని ప్రియాంక ఎదురుదాడికి దిగారు. దేశం కోసం తిట్లనే కాదు ఏకంగా బుల్లెట్లను కూడా భరించేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారని, మరి మోడీ సంగతి ఏమిటని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఉన్న వారికి సహజమైన తిట్లకే ఇంతగా మోడీ నొచ్చుకుంటున్నట్లుగా ఉంటే ఇక రాహుల్ సంగతి ఏమిటని నిలదీశారు. ప్రధాని మోడీ 91 తిట్ల దండకం గురించి చెపుతున్నారు. వీటన్నింటిని కలిపితే ఒక్క పేజీలో అచ్చువేసి అందించవచ్చు, అయితే తమ కుటుంబంపై వచ్చిన తిట్లు నిందల గురించి చెప్పాల్సి ఉంటే వీటిని పుస్తకాల మీద పుస్తకాలుగా ప్రచురించి పంపిణీ చేయవచ్చు అన్నారు. గత రెండు మూడు రోజులుగా తాను ఇక్కడి ఎన్నికల సభల్లో తిట్ల గురించి వాటిపై విమర్శల గురించి చూసి విస్తుపోతున్నానని, ప్రత్యేకించి ప్రధాని చెపుతున్న మాటలు విచిత్రంగా ఉన్నాయని తెలిపారు. మాజీ ప్రధాని దేశం కోసం బుల్లెట్లు భరించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు, పివి, మన్మోహన్ సింగ్‌లు దేశం కోసం ఎంతగానో పాటుపడ్డారు. అయితే ఇప్పుడున్న ప్రధాని మోడీ ఇంతకు ముందటి ప్రధానులకు భిన్నంగా ఉన్నారు. ఆయన తిట్లకే భయపడితే ఎట్లా? పైగా తిడుతున్నారని సభల్లో బాధపడటం ఎందుకు? ప్రజల బాధలను వినాల్సింది పోయి ఆయన తన బాధను ప్రజలకు తెలియచేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

జనం సమస్యలకు బదులు ఆయన సమస్య మీకు చెపుతున్నారని అన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రధాని కార్యాలయంలో ఇప్పుడు ప్రజల సమస్యల జాబితాకు బదులుగా ప్రధానిని ఇతరులు ఎన్నిసార్లు తిట్టారనే లిస్టు సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని మోడీని ఉద్ధేశించి తెలిపారు. మోడీజీ ధైర్యం తెచ్చుకోండి, రాహుల్‌ను చూసి నేర్చుకోండని బుల్లెట్లకు కూడా సిద్ధమైన రాహుల్ తిట్ల గురించి ఎక్కడా ఎవరికి చెప్పలేదే అన్నారు. తన సోదరుడు ఎప్పుడూ సత్యం కోసం సాగుతారని, ఇతరులు తిట్టినా కొట్టినా బుల్లెట్లు పేల్చినా సత్యం కోసం నిలుస్తారని తేల్చిచెప్పారు. ప్రజా జీవితంలోకి వచ్చిన వారు ఈ విధంగా భయపడకుండా ఉండాల్సి ఉంటుందని తెలిపిన ప్రియాంక తిట్లకు భయపడి ముందుకు వెళ్లకుండా ఉండటమే ధీరుల నైజం అన్నారు. రాహుల్ నుంచి మరిన్ని విషయాలు నేర్చుకుంటే చాలా మంచిది. ముందు ప్రజావాణిని ఆలకించడం నేర్చుకుంటే తరువాత ప్రధాని మోడీకి అన్ని విషయాలు తెలిసివస్తాయి. ప్రత్యేకించి తన సోదరుడు రాహుల్ నిజాయితీ ఏమిటనేది వెల్లడవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News