న్యూఢిల్లీ: ఆర్‌జెడి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం మద్దతు పలికారు. ఆయన పశుగ్రాసం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎవరైతే బిజెపి రాజకీయాలకు తలవొగ్గరో వారిని ఆ పార్టీ అన్ని విధాల వేధిస్తుందని అన్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆర్‌జెడి నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను రూ. 139.5 కోట్ల ఢోరంఢా కోశాగారం స్వాహా కేసులో, అలాగే దాణా కుంభకోణంలో ఆయనపై ఐదవ, చివరి కేసు పెట్టింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు మద్దతు పలికిన ప్రియాంక గాంధీ “ ఇది బిజెపి రాజకీయం ముఖ్యాంశం. ఎవరైతే ఆ పార్టీకి తలొగ్గరో వారిని అన్ని విధాల వేధిస్తుంది” అని ట్వీట్ చేశారు. “ ఈ రాజకీయాల కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్‌జీపై వారు దాడి చేశారు. ఆయనకు తప్పక న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను” అని కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అభిప్రాయపడ్డారు.