Wednesday, January 8, 2025

లోక్‌సభ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

క్రియాశీల రాజకీయాలలో చేరిన ఐదేళ్ల అనంతరం ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఒక చేతిలో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని లోక్‌సభ ఎంపీగా గురువారం ప్రమాణం చేశారు. ప్రియాంక తల్లి సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా, సోదరుడు రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యుడిగా ఇప్పటికే కొనసాగుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీలుగా కొనసాగడం అరుదైన సందర్భంగా చెప్పవచ్చు. 52 ఏళ్ల ప్రియాంక గాంధీ హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం చేస్తున్న సమయంలో ఆమె చేతిలో ఎరువు, నుపు రుంగులలో ఉన్న రాజ్యాంగం ప్రతి ఉంది. ఈ పుస్తకాన్నే చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ తన బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారు. జోడో జోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తుండగా మీగడ రంగు కేరళ సంప్రదాయ కసావు చీర ధరించి వయనాడ్ ఎంపీ ప్రమాణం చేశారు.

ఆమె ప్రమాణం చేస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆమె తల్లి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రైహాన్, కుమార్తె మిరయా గ్యాలరీల నుంచి తిలకించారు. అంతకుముందు పార్లమెంట్‌లోని సిపిపి కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీని కలసి భుభాకాంక్షలు తెలియచేశారు. ప్రమాణం అనంతరం లాంఛనాలను పూర్తి చేసిన ప్రియాంక తన సోదరుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీ రవీంద్ర చవాన్ కూడా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన మరాఠీలో భగవంతుడి పైన ప్రమాణం చేశారు. ఆయన తండ్రి వసంతరావు చవాన్ మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నికల జరిగింది. కాగా..అదానీ వివాదం, సంభాల్ హింసపై చర్చ కోసం డిమాండు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ మధ్యలోకి దూసుకురావడంతో ఇద్దరు సభ్యుల ప్రమాణం అనంతరం సభ వాయిదా పడింది.

బయటకు వెళ్లిపోయిన ఎంపీలు మకర ద్వారం మెట్ల వద్ద బారులు తీరి ప్రియాంక గాంధీకి అభినందనలు తెలియచేశారు. సంవిధాన్ సదన్ నేపథ్యంగా ప్రియాంక గాంధీతో కలసి రాహుల్ గాంధీ పోటో తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలుసుకున్న ప్రియాంక ఆయన నుంచి ఆశీస్సులు స్వీకరించారు. 2019లో క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐదేళ్ల అనంతరం ప్రజా ప్రతినిధిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి 4.1 లక్షల ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. రాహుల్ గాంధీని మించిన మెజారిటీని వయనాడ్ ప్రజలు ప్రియాంకకు ఇవ్వడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News