Monday, December 23, 2024

అరంగేట్రం.. వయా వయనాడ్!

- Advertisement -
- Advertisement -

గత 20 ఏళ్లుగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాను కాంగెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యకర్తను మాత్రమేనని చెప్పుకుంటూ వస్తున్న ప్రియాంక గాంధీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇది నిజంగా ఒక కొత్త పరిణామమే. చాలా కాలంపాటు ప్రియాంక తనకి రాజకీయాల్లోకి పూర్తికాలం వచ్చే ఆసక్తి లేదని అనేక ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు. దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల కారణంగానేమో ఆమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తూ, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ఒకవేళ ఆమె గెలిస్తే, గాంధీ పరివారానికి చెందిన ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి.. ఇలా అందరూ లోక్‌సభ సభ్యులై, ఎన్నికల రాజకీయాలలో మొదటిసారిగా ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో జరగనున్న లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ప్రియాంక గాంధీ యుడిఎఫ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తల్లి సోనియా గాంధీ, వయనాడ్ నుంచి గెలిచి రాజీనామా చేసిన సోదరుడు రాహుల్ గాంధీ వెంటరాగా ఆమె బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్ గాంధీ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ పార్లమెంటు స్థానాల నుండి పోటీ చేసి గెలిచారు.

ఈ రెండిట్లో కేరళలోని వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది. ఎలక్షన్ కమిషన్ వయనాడ్ ఉప ఎన్నికను ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ వెంటనే తమ అభ్యరిగ్థా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించింది. కొంత బిడియంగాను, ఎంతో సౌమ్యంగాను మాట్లాడుతూ ఉండే ప్రియాంక గాంధీ, జంకు లేకుండా సూటిగా దేశప్రధాని నరేంద్ర మోడీని సైతం అనేక మార్లు నిలదీశారు. దేశం ఎదుర్కొంటున్న పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభాలు, స్త్రీలపై హింస, అత్యాచారాలు, రైతులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలు వంటి సమస్యలను పక్కదారి పట్టించడానికి బిజెపి ప్రతి సందర్భంలోనూ మతం, దేశభద్రత వంటి సున్నితమైన అంశాలను భూతద్దంలో చూపిస్తోందంటూ ఆమె తన రాజకీయ ప్రసంగాలలో ఘాటుగా విమర్శిస్తూ ప్రజలను ఆకట్టుకోగలిగారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో కొంత రాటుతేలినట్టే. 1991లో రాజీవ్ గాంధీ మరణాంతరం జరిగిన ఎన్నికల్లో, యుక్తవయసులో ఉన్న ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో మొదటిసారి పాల్గొన్నారు.

అమేథి, రాయ్‌బరేలీ ప్రజలకు ఆమె చిరపరిచితురాలు. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ తరఫున రాయ్‌బరేలీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయ పరిణితి, సాధారణ ప్రజల హృదయాలను గెలుచుకోగల నేర్పు, వారిలోఒకరిగా కనపడుతూ జనాల్ని గుర్తుపట్టి పలకరించే పద్ధతి, సౌమ్యంగా, హేతుబద్ధంగా మాట్లాడటం ఇవన్నీ ప్రజలతో కనెక్ట్ కావడానికి ఆమెకు బాగా దోహదపడ్డాయి.
ఒక్క వయనాడ్‌లోనే కాదు జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూశాక జరుగుతున్న ఎన్నికలు ఇవి. ప్రియాంకా గాంధీ 2004 సాధారణ ఎన్నికల్లో తల్లి సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా అన్న రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి, రాయ్‌బరేలీ ప్రాంతాలలోని 10 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లోనూ తల్లి, సోదరుడి తరపున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా జనవరి 2019లో నియుక్తురాలయ్యారు. 2020న ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పూర్తి బాధ్యతల్ని తీసుకున్నారు. ఇక ఇక్కడి నుంచి ఆమె కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తూ వస్తున్నారు.

2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40% సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రియాంక ప్రకటించారు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ రెండు స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. నిరాశజనకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో వెనక్కి వెళ్లలేదు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ విస్తృతంగా పాల్గొనడమే కాకుండా పార్టీలో కూడా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు, తాను ఎన్నికలలో పోటీ చేస్తానని అప్పుడే ప్రకటించారు. వయనాడ్ ఎన్నికల్లో సిపిఐ తరఫున సత్యాన్ మోకరి, బిజెపి తరఫున కొజికోడు కార్పొరేటర్, పార్టీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ నిలబడనున్నారు.

రాహుల్ గాంధీ 2019 సాధారణ ఎన్నికల్లో వయనాడ్‌లో 4.60 లక్షల ఓట్లను గెలుచుకోగా, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 3.64 ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఈ నియోజకవర్గంలో ఆయన గెలిచినప్పటికీ ఒక రకంగా గతం కన్నా కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్ శాతాన్ని కోల్పోయినట్లే. వయనాడ్‌లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు మూడు జిల్లాలైన వయనాడు, మల్లపురం, కోజికోడ్ ఇందులో ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యుడిఎఫ్ చేతుల్లో నాలుగు, సిపిఎం పార్టీ చేతుల్లో రెండు ఉండగా, వామపక్షాలు మద్దతిస్తున్న స్వతంత్ర లెజిస్లేటర్ పివి అరవన్ ఒక స్థానంలో గెలిచారు. ఆయన ఇప్పుడు వామపక్షాలను విమర్శిస్తూ వారి నుంచి విడివడి ఐఎఎన్‌ఎస్ పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైనప్పుడు ఆయన చితాభస్మాన్ని గాంధీ కుటుంబం వయనాడ్‌లోని ఆలయం వద్ద పాపనాశనం నదిలో నిమజ్జనం చేసింది. ఆ రకంగా కూడా తమకి వయనాడ్‌తో ఆత్మీయ సంబంధం ఉందని గాంధీ కుటుంబం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది.

52 ఏళ్ల ప్రియాంక గాంధీ ఒకవేళ గెలిచి పార్లమెంట్లోకి ప్రవేశిస్తే అక్కడ కూడా సమర్థవంతంగానే తన పాత్రని నిర్వర్తించవచ్చు. రూపంలో, హావభావాలలో ఇందిరాగాంధీని పోలి ఉండే ప్రియాంక గాంధీ పట్ల సాధారణ ప్రజలకు ఒక రకమైన ఆదరణ ఉంది. ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా వ్యవహరించి, ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీ రాజభరణాల రద్దు, భూసంస్కరణలు, గరీబీ హటావో, 20 సూత్రాల పథకాలు వంటి పథకాలను అమలు చేసి పేదప్రజల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీని చూసినప్పుడు కూడా సాధారణ జనం తన నాయనమ్మ ఇందిరతో ఆమెకున్న పోలికలను తప్పకుండా గుర్తుకు తెచ్చుకుంటారు. ఇందిరా గాంధీ దక్షిణాది రాష్ట్రాలపట్ల ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉండేవారు. ఆమె తెలంగాణలోని మెదక్ నుండి, కర్ణాటకలోని చిక్కమగుళూరు నుండి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా కేరళలోని వయనాడ్‌ను తన చట్టసభల అరంగేట్రానికి వేదికగా మలుచుకుంటున్నారు.

మహిళలు రాజకీయాల్లోకి రావడం, నాయకత్వ స్థానాల్లోకి ఎదగడం ఇవాళ్టి అవసరం కూడా. భ్రష్టుపట్టిన, అవినీతిమయంగా మారిన పురుషాధిపత్య, ఆధిపత్య రాజకీయాలలో తక్కువ సంఖ్యలో ఉన్న స్త్రీలు చట్టసభలలో ఎంతో ప్రతిభావంతంగా, ధైర్యంగా తమ గళం వినిపిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి మాట్లాడుతున్న ఈ మహిళా పార్లమెంటరీ సభ్యులపట్ల రాజకీయవేత్తల్లో ఒక రకమైన జంకు కూడా ఉన్నట్లుంది. చట్టసభల్లో ఉన్న పురుష సభ్యులపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న పెద్దలు వారిపట్ల వ్యవహరించే తీరుకి, మహిళా పార్లమెంటేరియన పట్ల వ్యవహరించే తీరుకి చాలా తేడా ఉండటమే కాదు ప్రతి అంశంలోనూ విస్పష్టంగా పురుషాధిపత్యం పోకడలు కనిపిస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జయలలిత, మమతా బెనర్జీ, కనిమొళి, మహోవా మొయిత్రీ వంటి వారు తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రకటించినందుకు, పాలక పార్టీ నాయకుల్ని విమర్శించినందుకు వేధింపులకు గురికావడం కూడా తెలిసిందే.

వ్యక్తిగత జీవితంపై బురదచల్లడం, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడం, బెదిరింపులకు గురిచేయడం, అసభ్యంగా మాట్లాడటం.. ఇలాంటి అనేక కారణాలవల్ల మహిళా అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి కూడా ఈ పురుష నాయకుల్ని ఎదుర్కోలేక రాజకీయాలనుంచి విరమిస్తూ ఉన్నారు. ఈ రకపు ధోరణిని మనం చట్టసభల్లో కూడా చూస్తూనే ఉన్నాం. సంస్కారం, పరిమితి, రాజకీయ సంవాదం, ప్రజాస్వామిక పద్ధతుల్ని పాటించటం అనేవి చట్టసభల్లో నేడు మాయమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ గెలిచి చట్టసభలోకి అడుగుపెడితే తమ గళాలని ఎక్కుపెట్టి ప్రశ్నిస్తున్న మహిళలకు మరో గొంతు తోడవుతుంది. ఏదిఏమైనా, వయనాడ్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. వేచి చూద్దాం ఏమి జరుగుతుందో!.

విమల (రచయిత్రి సామాజిక కార్యకర్త)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News