న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ సీటును అట్టిపెట్టుకుని, కేరళలోని వయనాడ్ సీటును ఖాళీ చేస్తారని, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ప్రకటించారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తన నివాసలో చర్చించిన తరువాత ఖర్గే విలేకరులతో మాట్లాడారు.
‘రాహుల్ గాంధీ రెండు లోక్‌సభ సీట్లనుంచి గెలిచారు. కాని చట్టం ప్రకారం, ఆయన ఒక సీటు ఖాళీ చేయవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ రాయబరేలి అట్టిపెట్టుకుంటారు. ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేయాలని మేము నిశ్చయించాం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలియజేశారు. ఖర్గే నివాసంలో చర్చల్లో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
ఈ నిర్ణయం అనంతరం రాహుల్ మాట్లాడుతూ, తనకు రాయబరేలి, వయనాడ్ రెండింటితో భావోద్వేగభరిత అనుబంధం ఉన్నందున ఇది తనకు సంక్లిష్టమైన నిర్ణయం అని చెప్పారు. ‘వయనాడ్ నుంచి ఎంపిగా గడచిన ఐదు సంవత్సరాలు అత్యద్భుతమైన, ఆనందించదగిన అనుభవం. వయనాడ్ ప్రజలు చాలా సంక్లిష్ట సమయంలో నాకు మద్దతు, పోటీ చేసే శక్తి ఇచ్చారు. నేను దానిని ఎన్నటికీ మరవను. వయనాడ్‌ను సందర్శిస్తూనే ఉంటాను. వయనాడ్‌కు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాం’ అని ఆయన తెలిపారు.
‘రాయబరేలి, వయనాడ్ రెండింటికీ ‘ఇద్దరు ఎంపిలు ఉంటారు’ అని రాహుల్ చెప్పారు. ‘నాకు రాయబరేలితో పాత సంబంధం ఉంది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తేలికైన నిర్ణయం కాదు. ఎందుకంటే రెండింటి (వయనాడ్, రాయబరేలి) పట్ల ఆప్యాయత ఉంది’ అని రాహుల్ చెప్పారు. రాహుల్ గాంధీ వయనాడ్, రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గెలిచారు. లోక్‌సభ ఫలితాలు ప్రకటించిన 14 రోజుల లోగా ఆయన ఆ రెండింటిలో ఒక సీటు ఖాళీ చేయవలసి ఉంటుంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడ్డాయి. ‘రాహుల్ లేని లోటును వయనాడ్ ప్రజలకు కనిపించకుండా నేను చేస్తాను’ అని ప్రియాంక గాంధీ చెప్పారు. పోటీ గురించి తాను ‘ఏమీ భయపడడంలేదు’ అని, వయనాడ్‌కు తన ‘అత్యుత్తమ సేవలు’ అందిస్తానని ప్రియాంక చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి మరొక కంచుకోట అయిన అమేథీ ఇప్పటికే కాంగ్రెస్ హస్తగతమైంది. గాంధీ కుటుంబానికి సుదీర్ఘ కాలంగా అనుయాయిగా ఉన్న కె ఎల్ శర్మ కేంద్ర మాజీ మంత్రి, బిజెపికిచెందిన స్మృతి ఇరానీని ఓడించి అమేథీ సీటు గెలిచారు.