Friday, January 24, 2025

రాయబరేలి, అమేథీలో ప్రియాంక మకాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తారు. అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆ రెండు స్థానాలలో పార్టీ విజయం సాధించేలా చూసేందుకు ప్రియాంక ఆ రెండు నియోజకవర్గాల్లో మకాం వేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజుల తరబడి సాగుతున్న సస్పెన్స్‌కు తెర దించుతూ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు చోట్ల తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తన తల్లి సోనియా గాంధీ గత రెండు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, గాంధీ కుటుంబాన్ని సన్నిహిత సహచరుడు కిశోరి లాల్ శర్మ అమేథి బరిలో నిలిచారు.

ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రచార బాధ్యత చేపట్టారని, ఆమె సోమవారం నుంచి ఎన్నికలు ముగిసే వరకు రాయబరేలి, అమేథిలో మకాం వేస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. తన సోదరుడు రాహుల్ గాంధీ, కెఎల్ శర్మ విజయం కోసం ఆమె ఉద్ధృతంగా ప్రచారం చేస్తారని ఆ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తుండగా, తమ కుటుంబ కంచుకోటలైన ఆ రెండు చోట ప్రచారం బాధ్యతను ప్రియాంక గాంధీ స్వయంగా చేపట్టారు. రాయబరేలిలో భారీ ఆధిక్యంతో విజయం సాధించాలని, అమేథీని తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీర్మానించుకున్నదని ఆ వర్గాలు తెలిపాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథిలో రాహుల్ గాంధీని బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ ఓడించిన విషయం విదితమే. ‘ఆమె (ప్రియాంక గాంధీ) అమేథి, రాయబరేలిలో ప్రచారానికి సారథ్యం వహిస్తారు. ఎన్నికలు ముగిసే వరకు ఆమె ఆ రెండు నియోజకవర్గాల్లో ఉంటారు’ అని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రియాంక గాంధీ వందలాది ‘నుక్కడ్ సభలు’, సమావేశాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు సూచించాయి. ‘రాయబరేలి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ఆమె అక్కడ ఒక అతిథి గృహంలో బస చేస్తారు. బూత్ నిర్వహణ నుంచి ప్రజలతో ముఖాముఖి వరకు ప్రతి అంశం ఆమె చూస్తారు’ అని ఆ వర్గాలు తెలిపాయి.

స్వాతంత్య్ర యోధుల కుటుంబాలను, గాంధీ కుటుంబంతో దశాబ్దాలుగా కుటుంబ సంబంధాలు ఉన్నవారిని ఇప్పటికే కలుసుకోవడం ప్రారంభించినట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. రెండు నియోజకవర్గాల్లో డిజిటల్, సామాజిక మాధ్యమ ప్రచారాన్ని కూడా ఆమె పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరినీ కలుసుకోవడానికి సంస్థాగతంగా వివిధ స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వంటి అగ్ర నేతల ప్రచార వ్యూహాల రచన, కార్యక్రమాల బాధ్యతను కూడా ప్రియాంక గాంధీ చేపడతారు.

ఆమె 250 నుంచి 300 గ్రామాలు సందర్శిస్తారని, రెండు నియోజకవర్గాలకు సమంగా సమయం కేటాయిస్తారని ఆ వర్గాలు తెలియజేశాయి. అమేథిలో 25 సంవత్సరాల అనంతరం గాంధీ కుటుంబానికి చెందని నేత ఒకరు సిట్టింగ్ ఎంపి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. గాంధీల తరఫున ఆ రెండు ప్రతిష్ఠాకర నియోజకవర్గాల బాధ్యతను నిర్వర్తించిన కీలక వ్యక్తి కెఎల్ శర్మ. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో ఐదవ దశలో ఈ నెల 20న అమేథి, రాయబరేలి సీట్లకు పోలింగ్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News