రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ లోక్‌సభ స్థానంలో ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ బుధవారం ధీమా వ్యక్తం చేసింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వయనాడ్‌లో విజయంపై తమ పార్టీ సంపూర్ణ నమ్మకంతో ఉందని తెలిపారు. ఎన్నికల కోసం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సన్నాహాలు ప్రారంభించారని, అయితే ఇంతలో వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ, యుడిఎఫ్ చురుకుగా వివిధ కార్యక్రమాలు చేపడతాయని ఆయన చెప్పారు.
చట్ట ప్రకారం ఆరు నెలల్లో ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్‌తో గడువు ముగియనున్నది. ఎప్పుడు ఎన్నికలను ప్రకటించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూనే మిగిలిన రాష్ట్రాలలో కూడా ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రెండు లోక్‌సభ స్థానాలలో గెలుపొందిన రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి స్థానాన్ని ఉంచుకుని వయనాడ్‌కు రాజీనామా చేస్తారని, ఖాళీ అయ్యే వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్‌లో ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలిచిన రెండు స్థానాలలో ఒక స్థానాన్ని వదులుకుంటున్నట్లు రాహుల్ ప్రకటించాల్సి ఉంది.