Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ హెచ్‌పి శ్రేయోభిలాషి కారు:ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం బిజెపిపైన, ప్రధాని నరేంద్ర మోడీపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ‘కూల్చివేత’కు ప్రయత్నించిన ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్ శ్రేయోభిలాషి కారు అని ప్రియాంక అన్నారు. చాంబా పట్టణంలో చారిత్రక చౌగన్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ప్రసంగిస్తూ, ఎన్నికైన ప్రభుత్వాన్ని ధన బలం ఉపయోగించి ఎంఎల్‌ఎల కొనుగోలు ద్వారా కూల్చేందుకు ప్రధాని ప్రయత్నించారని ఆరోపించారు.‘మనం కోరే నిజాయతీ రాజకీయాలు ఇవేనా’ అని ఆమె అడిగారు. అవినీతి పద్ధతులకు పాల్పడైనా సరే నయానా భయాన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రధాని మోడీ, బిజెపి నేతలు అనుకున్నారని కూడా ఆమె ఆరోపించారు. అటువంటి పద్ధతుల ఫలితమే అగ్నివీర్ పథకం అని ఆమె అన్నారు. ప్రధాని మోడీ హిమాచల్, చాంబా ప్రజలతో ‘సంబంధం కోల్పోయారు’ అని కూడా ప్రియాంక విమర్శించారు.

2003 వరద విపత్తు సమయంలో ఆయన ఒక పర్యాటకుడుగా మాత్రమే రాష్ట్రాన్ని సందర్శించారని, సాయం అందించలేదని ఆమె ఆరోపించారు. మోడీ హిమాచల్‌ను తన రెండవ ఇంటిగా పేర్కొన్నప్పటికీ నిరుడు హిమాచల్‌లో వర్షాకాలంలో విపత్తు సమయంలో బిజెపి ఎటువంటి సాయమూ కల్పించలేదని ఆమె ఆక్షేపించారు. అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో మకాం వేసి, ప్రజల బాధ పంచుకున్నారని, సహాయం అందజేశారని ఆమె తెలిపారు. అధిక నిరుద్యోగిత రేటుకు, ప్రభుత్వ రంగంలో ఖాళీలకు బిజెపి లోపభూయిష్ట విధానాల కారణం అని ప్రియాంక పేర్కొన్నారు. మోడీ కోటీశ్వరుల మిత్రులను మాత్రమే బిజెపి ‘ఇష్టపడింది’ అనిఆమె ఆరోపించారు. ‘బిజెపి హయాంలో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందడం లేదు, ఉద్యోగం లేని యువజనుల సంఖ్య70 ఏళ్లలో అత్యధికం, నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటుతున్నాయి. కానీ ప్రధాని నోటి నుంచి నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటి మాటలను మీరు వినరు’ అని ప్రియాంక అన్నారు. ప్రజలను సాధికారులను చేయడానికి బదులు బిజెపి ప్రభుత్వం సమాజాన్ని బలహీనం చేయజూసిందని ప్రియాంక ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News