కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా ప్రియాంక టిబ్రెవాల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 30న భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ జరగనున్నది. అక్టోబర్ 3న ఫలితాలు వెలువడతాయి. సిపిఎం అభ్యర్థిగా న్యాయవాది శ్రీజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. న్యాయవాది అయిన ప్రియాంక టిబ్రెవాల్ అలీపూర్‌లోని సర్వే భవనంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమె వెంట అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి, బిజెపి ఎంపి అర్జున్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు. భవానీపూర్ నుంచి ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యే సువందేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నందిగ్రామ్‌లో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఇక్కడ నుంచి పోటీ చేయడం కోసమే సువందేవ్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవిలో మమత కొనసాగాలంటే నవంబర్ 5వ తేదీలోపల ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావలసి ఉంటుంది.