కోర్టు ఆవరణలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
కొల్‌కతా : స్ధానిక కలకత్తా న్యాయస్థానం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి చిదంబరం సంకట స్థితిని ఎదుర్కొన్నారు. బుధవారం నాటి ఈ ఘటనలో కొందరు ఆయనను కోర్టు లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. చిదంబరం గో బ్యాక్ నినాదాలకు దిగారు. సీనియర్ అడ్వకేట్ కూడా అయిన చిదంబరం బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్నికి మద్దతుగా వాదించేందుకు స్థానిక న్యాయస్థానానికి వచ్చారు. మెట్రో డెయిరీ షేర్లను అగ్రో ప్రాసిసింగ్ సంస్థ కెవెంటర్‌కు విక్రయించాలనే నిర్ణయం వివాదాస్పదం అయింది. దీనిని బెంగాల్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అధీర్ చౌదరి వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ నేతలలో ఒకరైన చిదంబరమే న్యాయవాదిగా మమత బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా వాదించేందుకు సిద్ధపడ్డారు. లాయర్లు, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు చిదంబరం వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మద్దతుదార్లు అయిన లాయర్లు చిదంబరంపై కోర్టు ఆవరణలోనే విమర్శలకు దిగారు.
ఆయన పార్టీ మనోభావాలను దెబ్బతీస్తున్నారని తిట్టిపోశారు. చిదంబరం వంటి వారి ఇటువంటి వైఖరితోనే కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టిందని లాయర్లు విమర్శించారు. చిదంబరం వెంటనే కోర్టు ఆవరణ నుంచి బయటకు వెళ్లాలని నినాదాలకు దిగారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ విక్రయ వ్యవహారం జరిగిందని పిసిసి నేత తరఫు లాయరు బికాశ్ భట్టాచార్య తెలిపారు. షేర్లు కొన్న కెవెంటర్ ఇప్పటికే సింగపూర్ కంపెనీకి అత్యధిక ధరలకు షేర్లను అమ్ముకుందని, ఇక్కడ తక్కువ ధరకు షేర్లు తీసుకుని ఎక్కువ ధరకు అమ్ముకోవడం వెనుక అవినీతిని బయటికి లాగాల్సి ఉందని లాయర్ తెలిపారు. జరిగిన ఘటనలపై చిదంబరం స్పందించారు. స్వేచ్ఛా దేశంలో ఇటువంటి వాటిపై తాను ఏమీ చెప్పలేనని .. తానెందుకు స్పందించాలని ప్రశ్నించారు.