Thursday, January 23, 2025

ప్రొబేషనరీ ఎస్సై ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Probationary SI Suicide at Moulali Railway Station

ప్రొబేషనరీ ఎస్సై ఆత్మహత్య
మౌలాలి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న రమణ
విచారణ చేస్తున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రైలు కింద పడి ప్రొబేషనరీ ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపి రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం, వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ(26) 2020లో హైదరాబాద్ రేంజ్‌లో ఎస్సైగా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తనతో పాటు పనిచేసే మరో ఎస్సై ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లి, అశోక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 10గంటల సమయంలో పనిఉందంటూ బయటకు వెళ్లిన రమణ తిరిగి ఇంటికి రాలేదు.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం మౌలాలి, చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బీ క్యాబిన్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు రైల్వే కీమ్యాన్ వెంకటేశ్వర్లు గుర్తించారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పడంతో వారు జిఆర్‌పి పోలీసులకు చెప్పారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న జిఆర్‌పి ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ఆధారంగా మృతుడిని ఎస్సై రమణగా గుర్తించారు. మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొబేషనరీ ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని జిఆర్‌పి ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Probationary SI Suicide at Moulali Railway Station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News