Sunday, April 13, 2025

నేషనల్ హెరాల్డ్ కేసు..రూ. 700 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఇడి రెడీ

- Advertisement -
- Advertisement -

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దూకుడు పెంచింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)కు చెందిన రూ. 700 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఇడి చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు, ఎజెఎల్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేశామని ఇడి శనివారం వెల్లడించింది. ఆస్తులు ఉన్న ప్రదేశాల్లో ఆయా ఆస్తుల రిజిస్ట్రార్‌కు సంబంధిత పత్రాలు అందజేసినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదే సమయంలో ఢిల్లీలో ఐటిఒ (5ఎ, బహదూర్ షా జాఫర్ మార్గ్)లో, ముంబయిలో బాంద్రా (తూర్పు) ప్రాంతం (ప్లాట్ నంబర్ 2, సర్వే నంబర్ 341)లోని హెరాల్డ్ హౌస్‌లో, లక్నోలో బిషేశ్వర్ నాథ్ రోడ్ (ఆస్తి నంబర్ 1)లో గల ఎజెఎల్ భవనంలో ఉన్న ‘ఆ ఆస్తుల’ వద్ద నోటీసులు అంటించడమైంది. ఇడి స్వాధీనం చేసుకోనున్న ఆ భవనాలను ఖాళీ చేయాలని నోటీసులు ప్రాథమికంగా కోరుతున్నాయి.

‘నేషనల్ హెరాల్డ్’ దినపత్రికను ప్రచురించే ఎజెఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం వంతున వాటా ఉన్నది. తాజాగా, ఢిల్లీ, ముంబయి, లక్నో నగరాల్లో ఉన్న ఎజెఎల్ ఆస్తులను ఇడి గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఇడి చర్యలకు ఉపక్రమించింది. జప్తు చేయనున్న ఆస్తుల్లో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. గతంలోనే ఆ ఆస్తులను ఇడి తాత్కాలికంగా జప్తు చేసింది. అయితే, ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇడి సిద్ధమైంది. యంగ్ ఇండియన్ సంస్థ ఎజెఎల్ ఆస్తులను ఉపయోగించి రూ. 18 కోట్ల మేరకు నకిలీ విరాళాలు, రూ. 38 కోట్ల మేరకు నకిలీ అద్దెలు, రూ. 29 కోట్ల నకిలీ ప్రకటనల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించిందని ఇడి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఇడి దాదాపు నిర్దారణకు వచ్చింది. అందుకు పిఎంఎల్‌ఎ కింద ఆస్తుల జప్తునకు ఇడి చర్యలు తీసుకుంటున్నది. ఇడి దర్యాప్తును ‘కక్షపూరిత ఎత్తుగడ’గా కాంగ్రెస్ ఇంతకుముందు ఆరోపించింది. ఇడిని బిజెపికి ‘సంకీర్ణ భాగస్వామి’గా కాంగ్రెస్ అభివర్ణించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News