న్యూఢిల్లీ : భారత్‌లో వోటర్ల సంఖ్య పెంపుదలకు యుఎస్ 21 మిలియన్ డాలర్లు సమకూర్చిందన్న ఆరోపణపైన, ‘ముడుపుల’పైన దర్యాప్తు నిర్వహించాలని బిజెపి కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్వపు అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ ఆర్థిక సహాయం అంశాన్ని లేవదీసిన నేపథ్యంలో దర్యాప్తు కోసం బిజెపి విజ్ఞప్తి చేసింది. భారత్‌లో ‘డీప్‌స్టేట్ ఆస్తుల’ కొనసాగింపు కోసం ఆ డబ్బు వినియోగించారని బిజెపి ఆరోపించింది. భారత్‌లో వోటర్ల సంఖ్య మెరుగుదల నిమిత్తం యుఎస్ ప్రభుత్వం 21 మిలియన్ డాలర్ల సహాయాన్ని కేటాయించడాన్ని అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రశ్నించారు.
దానిని ఆయన ‘ముడుపులు’గా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ రంగం పటిష్ఠతకు దాదాపు 21 మిలియన్ డాలర్లు, నేపాల్‌లో జీవ వైవిధ్యం కోసం 19 మిలియన్ డాలర్లు కేటాయించడం గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ‘భారత్‌లో వోటర్ల సంఖ్య మెరుగుదల కోసం 21 మిలియన్ డాలర్లు. భారత్‌లో వోటర్ల సంఖ్య గురించి మనం ఎందుకు పట్టించుకుంటున్నాం? మనకు తగినన్ని సమస్యలు ఉన్నాయి. మన దేశంలో వోటర్ల సంఖ్య మెరుగుదలను కోరుకుంటున్నాం.
మనం కోరుకోవడం లేదా? ఆ డబ్బు అంతా భారత్‌కు వెళుతోందని మీరు ఊహించగలరా? వారు దానిని పొందిన తరువాత ఏమి ఆలోచిస్తుంటారని నా అనుమానం’ అని అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ గవర్నర్ల సంఘం సమావేశంలో చెప్పారు. ‘ఇప్పుడు అది ముడుపుల పథకం. వారు దానిని పొందిన తరువాత ఖర్చు చేయడం వంటిది కాదని మీకు తెలుసు, దానిని పంపినవారికి వారు తిరిగి ముడుపులు చెల్లిస్తారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ రంగం పటిష్ఠతకు 29 మిలియన్ డాలర్లు. రాజకీయ రంగం అంటే అర్థం ఏమిటో వారికి తెలియదు. దాని అర్థం ఏమిటి?’ అని ట్రంప్ అన్నారు.