Sunday, January 19, 2025

జనవరిలో పోడు భూముల సమస్య పరిష్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, రవాణా, పరిపాలన వికేంద్రీకరణ వంటి అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులతో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. శనివారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఈ ఏడాది సాధించిన ప్రగతిపై మంత్రి సత్యవతి రాథోడ్ విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌టి రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజనులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు పెరిగాయని తెలిపారు.

పోడు భూముల సమస్యను కూడా జనవరి నెలలో పరిష్కరించనున్నామని, అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందించబోతున్నామని తెలిపారు. విద్య ద్వారానే వికాసం ఉంటందని నమ్మిని ముఖ్యమంత్రి రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని అందులో 183 గిరిజన గురుకులాలు ఉండగా త్వరలో మరో మూడు గిరిజన గురుకులాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని, ఇప్పటివరకు 1200 మందికి పైగా గిరిజన విద్యార్థులు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలు పొందారని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య నభ్యసించడానికి రూ.20 లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందజేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి పంచాయతీ భవనాల నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్ల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నెలకొల్పాలని సంకల్పించిందని, ఆ దిశగా ఇప్పటికే 12 కాలేజీలను ప్రారంభించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఎస్‌టి యువతీ యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి భారీ సబ్సిడీ ఇస్తూ సిఎం ఎస్‌టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు.
1000 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు
రాష్ట్రంలోని ప్రతి గిరిజన ఆవాసానికి బిటి రోడ్డు సౌకర్యం ఉండాలని మారుమూల తండాలకు బిటి రోడ్లు మంజూరు చేయడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ సంవత్సరం 12,475 గిరిజన ఆవాసాలకు బిటి రోడ్డు సౌకర్యం కల్పించడానికి రూ.1000 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారానిన అందించడం జరుగుతోందని, దీని వల్ల రాష్ట్రంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించడం జరిగిందన్నారు. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించిందని మంత్రి గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షా 116 రూపాయలను అందించడం ద్వారా బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు.

పిల్లలపై అఘాయిత్యాల కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఫోక్సో కోర్టును మోడల్‌గా తీసుకొని దేశవ్యాప్తంగా విస్తరించాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహిత కౌలాశ్ సత్యర్థి సూచించారని తెలిపారు. గిరిజనుల సంక్షేమం పథకాలపై రాష్ట్ర పతి సమీక్షించి ప్రశంసించారని వివరించారు. అంతకు ముందు మంత్రి డిఎస్ భవన్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, స్పెషల్ సెక్రటరి శ్రీధర్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సిఇ శంకర్, జెడి కళ్యాణ్ రెడ్డి, జిసిసిజిఎం సీతారాంనాయక్, ట్రైకార్ జిఎం శంకర్‌రావు తదితరులు పల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News