ఈనెల 18వ తేదీ నుంచి 700ల క్రషర్లు మూతబడ్డాయి
వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి
తెలంగాణ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రషర్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే నిర్మాణ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలంగాణ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఫిలింనగర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 700లకుపైగా క్రషర్లు మూతపడ్డాయన్నారు. నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, ఎన్నో ఏళ్ల క్రితం నిర్వహించిన ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన రాయల్టీని చెల్లించాలంటూ అధికారులు ఒత్తిళ్లు తీసుకురావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓల ప్రకారం ప్రభుత్వ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల నుంచి నేరుగా ఎనిమిది శాతం సీనరేజీ పన్నులు వసూలు చేశారని దాంతో క్వారీ నుంచి బయటికి వెళ్లే మెటల్ రాయల్టీ వసూలు చేసే అవకాశం లభించలేదన్నారు.
అయితే సుమారు 20 ఏళ్ల తర్వాత గతంలో చేసిన మైనింగ్ మొత్తానికి ఇప్పుడు ఒకేసారి రాయల్టీ చెల్లించాలనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జీఓ నెం 21 ప్రకారం కొత్తగా టన్నుకు ? 52 పర్మిట్ ఫీజు విధించడం జరిగిందని గతంలో ఈ ఫీజు లేదన్నారు. క్వారీ లీజు ట్రాన్స్‌ఫర్ ఫీజు హెక్టార్‌కు రూ. 10 లక్షలుగా నిర్ణయిం చారని గతంలో క్వారీ మొత్తానికి రూ1000లు మాత్రమే ఉండేదన్నారు. సుమారు మూడేళ్ళుగా తమకు ఈసీలు మంజూరు చేయడం లేదని ఒక వైపు పిసిబి అధికారుల వేధింపులు, మరోవైపు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిన అధికారుల అలసత్వం కారణంగా ఈ రంగం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిందన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు బూడిది నందారెడ్డి, ఇందుల సురేందర్ రెడ్డి, కార్యదర్శి కూన శ్రీనివాస్, తిరుపతిరావు, మహేశ్వర్, సత్తిరెడ్డి, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.