Thursday, April 24, 2025

అమెరికాలోనూ కౌలు రైతులకు సమస్యలే

- Advertisement -
- Advertisement -

భారత దేశంలోను, అమెరికాలోను కౌలు రైతుల చట్టాలు, సమస్యలు, భూకామందుల దోపిడీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. అమెరికాలోని వ్యవసాయ కుటుంబాల మొత్తం జనాభా 2 శాతం మాత్రం ఉంటే, భారత దేశంలో 68% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న వ్యవసాయ వ్యత్యాసం ఇదే. ఉద్యమాలు లేదా వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల ఫలితంగా పాలక ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు, కౌలుదారీ చట్టాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కౌలుదారీ చట్టాలు చేశాయి. 1950లో తెలంగాణ కౌలుదారీ చట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1956లో చేసిన ఆంధ్రా కౌలుదారీ చట్టం, 2011లో అధీకృత కౌలుదారీ చట్టం, 2019లో వైసిపి ప్రభుత్వం తెచ్చిన పంట సాగుదార్ల రక్షణ చట్టం మొదలైనవి రైతాంగ ఉద్యమాల ఫలితంగా వచ్చినవే. ఈ అన్ని చట్టాలలోనూ కౌలు ఒప్పందం ఉండాలని, సంస్థాగత రుణాలు, పంట నష్టపరిహారాలు పొందటానికి భూయజమాని అనుమతి ఉండాలని పేర్కొన్నాయి. ఆ విధంగా కౌలుదారీ చట్టాలు అలంకారప్రాయంగా మారాయి. అమెరికాలోనూ కౌలు చట్టాలు ఈ విధంగానే ఉన్నాయి.
అమెరికా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 2017లో 90 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే, 2024 నాటికి 87 కోట్ల, 60 లక్షలకు తగ్గిందని, తగ్గుదల 3 శాతమని ఎకనమిక్స్ రీసెర్చ్ సర్వీసు ద్వారా తెలియచేయబడింది. 2017 వ్యవసాయ కమతాలు 20 లక్షల 40 వేలు ఉండగా, 2022 నాటికి 20 లక్షల 3 వేలకు తగ్గాయి. 2000 సంవత్సరంలో అమెరికాలో సగటు కమతం భూమి 442 ఎకరాలు కాగా, 2022 నాటికి 441 ఎకరాలకు పెరిగింది. అమెరికాలో 50 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగిన చిన్నకమతాలు 6 లక్షల, 71 వేలు ఉన్నాయి. ఈ కమతాలు సంఖ్య తగ్గటం, మధ్యస్థ భూకమతాలు కూడా తగ్గటం వలన 2 వేల ఎకరాల కన్నా ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన కమతాలు పెరిగి సగటు కమతం భూ విస్తీర్ణం పెరిగింది. సంవత్సరానికి 3 లక్షల 50 వేల డాలర్ల కన్నా తక్కువ ఆదాయం వచ్చిన కమతాలను చిన్న కమతాలు అంటారు. ఇవి మొత్తం కమతాల్లో 86% గా (10 లక్షల 72 వేలు) ఉన్నాయి. సంవత్సరానికి 10 లక్షల డాలర్ల కన్నా ఎక్కువ ఆదాయం పొందే వాటిని పెద్ద కమతాలు అంటారు. మొత్తం కమతాల్లో ఇవి 4%గా ఉన్నాయి. వీటి మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 48 శాతంగా ఉంది. అమెరికాలో వ్యవసాయ భూమి ఎక్కువ భాగం (సుమారు 60 లేక 70%) వ్యక్తిగత లేదా కుటుంబ కమతాలుగా ఉంది. 2014 లో ఒక సర్వే ప్రకారం 96% కమతాలు కుటుంబ యాజమాన్యంలో ఉన్నాయి. ఇవి 52 కోట్ల, 80 లక్షల ఎకరాలు కలిగి ఉన్నాయి.
అమెరికాలో కౌలు సేద్యం కీలక పాత్ర పోషిస్తున్నది. మొత్తం రైతుల్లో 28% అంటే 5 లక్షల, 70 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సేద్యంలో, ఉత్పత్తిలో కౌలు రైతులు ముఖ్య భూమిక వహిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో 40 శాతం (35 కోట్ల, 30 లక్షల ఎకరాలు) కౌలు రైతులు సేద్యం చేస్తున్నారు. ఇందులో 80 శాతం ఎటువంటి వ్యవసాయం చేయని భూకామందుల భూములే ఉన్నాయి. భారత దేశంలో లాగానే అమెరికాలో కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, పంట రుణాలు కౌలు రైతులకు అందటం లేదు. కౌలు ఒప్పందం కూడా సంవత్సరం లేదా అంతకన్నా తక్కువగా ఉంది. చాలా కౌలు ఒప్పందాలు ముఖ్యంగా చిన్న రైతులు చేసుకునే ఒప్పందాలు భారత దేశంలో లాగానే నోటి మాటపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చట్టపరమైన కౌలు గుర్తింపు ఉండదు. అమెరికా వ్యవసాయ శాఖ కార్యక్రమాల్లో (సబ్సిడీలు, రుణాలు) దరఖాస్తు చేసుకునేందుకు కౌలు రైతులు ఫార్మర్ ఆపరేటింగ్ ప్లాన్ సమర్పించాలి. ఇందుకు కౌలు ఒప్పందం లేదా భూమి యజమాని నుండి లిఖితపూర్వక అనుమతి అవసరం. ఫలితంగా చాలా మంది కౌలురైతులు సబ్సిడీలు, రుణాలు పొందలేకపోతున్నారు. 2022లో అమెరికా ప్రభుత్వం రైతులకు 15.6 బిలియన్ డాలర్ల సబ్సిడీలను ప్రకటించింది. 1995 నుండి 2021 వరకు 478 బిలియన్ డాలర్ల సబ్సిడీలు పంపిణీ చేయబడ్డాయి. ఇడబ్లుజి (ఎన్విరాన్‌మెంట్ వర్కింగ్ గ్రూపు) నివేదిక ప్రకారం అందులో పైస్థాయిలో ఉన్న (పెద్ద, ధనిక కమతాలు) భూ యజమానులే 79% (సుమారు 377 బిలియన్ డాలర్లు) సబ్సిడీల రూపంలో పొందారు. అతి చిన్న కమతాలు కలిగిన 80% రైతులు కేవలం 9% సబ్సిడీలు మాత్రమే అందాయి.
కౌలు రైతులు సబ్సిడీలకు అర్హులైనా చాలా సందర్భాల్లో భూయజమానులే వాటిని పొందారు. సబ్సిడీలు పొందటానికి రైతు సంవత్సర ఆదాయం 9 లక్షల డాలర్ల కన్నా తక్కువ ఉండాలి. ఈ నిబంధన ప్రకారం చిన్న రైతులకే ఎక్కువగా సబ్సిడీలు అందాలి. లిఖితపూర్వక కౌలు ఒప్పందం లేకపోవటం, భూయజమాని అనుమతి పత్రం లేకపోవటంతో కౌలు రైతులు సబ్సిడీలకు దూరంగా ఉన్నారు. అమెరికాలో నేడు కౌలు రైతులు సంక్షోభంలో ఉన్నారు. కౌలు రైతులకు సొంత భూమి లేకపోవటం, భూమిని అధిక రేటుకు కౌలుకు తీసుకోవటం, పంట ఖర్చులు పెరగటం, పండించిన పంటలకు తగిన ధరలు లభించకపోవటం, వాతావరణ మార్పులు కౌలు సేద్యం పై ప్రతికూల ప్రభావం చూపటం, సబ్సిడీలు, రుణాలు అందకపోవటం, దేశంలో ఆర్థిక మాంద్యం ఎర్పడినప్పుడు కౌలు రైతుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపటం కౌలు సేద్య సంక్షోభానికి కారణంగా ఉంది. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.
అమెరికాలోని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్సన్ (సిడిసి) ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వ్యవసాయం, అటవీ, మత్స్యరంగాల్లో పని చేసే వారిలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష మందిలో 36 గా ఉంది. ఇది సాధారణ జనాభా మరణాల రేటు (లక్షకు 14.4) కన్నా చాలా ఎక్కువగా ఉంది. 2020లో యూనివర్శిటీ ఆఫ్ ఐవోవా అధ్యయనం ప్రకారం రైతులలో వ్యవసాయ సంబంధిత వృత్తుల్లో ఉన్న వారిలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్షకు 43.7గా ఉంది. కౌలు సేద్యపు సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, కౌలురైతుల ఆందోళన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తయారు చేస్తున్నది. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు, భూకామందులతో చేసుకునే ఒప్పందాల్లో సబ్సిడీలు, బీమా ప్రయోజనాలు పొందే హక్కును చేకూర్చేలా చేసే మార్గదర్శకాలు, ప్రభుత్వ చేసే సహాయాన్ని యజమానులు అడ్డుకోకుండా చేస్తుందని, నేరుగా కౌలురైతులు సహాయం పొందే అవకాశం కల్పిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అన్నదాని కోసం అమెరికా కౌలురైతులు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం పెద్ద భూఎస్టేట్ దారుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడేది కావటమే. అందుకు భిన్నంగా వ్యవసాయ చట్టం ఉండదు. భూమిలేని కౌలురైతులకు అవసరం మేరకు భూపంపిణీ చేయాలి. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రుణాలు కౌలు రైతులకే ఎక్కువ అందాలి. పంటలకు తగిన ధరలు లభించాలి. లిఖితపూర్వక కౌలు ఒప్పందం జరగాలి. పెద్ద భూక్షేత్రాలపై భూపరిమితి విధించి మిగులు భూములు భూమిలేని కౌలురైతులకు పంపిణీ చేయాలి. ఇవి అమలు జరిగితేనే అమెరికాలో కౌలు రైతుల సమస్యలు పరిష్కరించబడతాయి.

కౌలు సేద్యపు సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, కౌలురైతుల ఆందోళన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తయారు చేస్తున్నది. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు, భూకామందులతో చేసుకునే ఒప్పందాల్లో సబ్సిడీ లు, బీమా ప్రయోజనాలు పొందే హక్కును చేకూ ర్చేలా చేసే మార్గదర్శకాలు, ప్రభుత్వ చేసే సహా యాన్ని యజమానులు అడ్డుకోకుండా చేస్తుందని, నేరుగా కౌలురైతులు సహాయం పొందే అవకాశం కల్పిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబు తున్నారు. ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అన్నదాని కోసం అమెరికా కౌలురైతులు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే అమెరికా ప్రభుత్వం పెద్ద భూఎస్టేట్ దారుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడేది కావటమే.

– బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News