కారేపల్లి : గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుటలో ఐటిడిఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం, మండల అధ్యక్షులు అజ్మీర శోభన్ నాయక్ ఆరోపించారు. మండల పరిధిలోని శాంతినగర్, రేలకాయలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి సమస్యలను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు తాగునీరు అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్స్ పాడైపోయి మూలకు వదిలేసారని, విద్యార్థులు మిషన్ భగీరథ నీళ్లు తాగలేక అవస్థలు పడుతున్నారని, వెంటనే ఆర్ ఓ వాటర్ ప్లాంట్లను మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
హాస్టల్లో మరుగుదొడ్లు, స్థానపు గదులు కంపు కొడుతున్న, పాడైన వాటిని బాగుచేసే నాధుడే కరువు అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీడీఏ సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించాలని వారు కోరారు.