చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించేందుకు గురువారం ఏపి సిఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు కలవనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని గతంలో ఏపి సిఎం జగన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే –ఆన్‌లైన్ టికెటింగ్ అడిగాము. ఆన్‌లైన్ టికెటింగ్ నిర్మాతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం, ఛాంబర్ కలిసి ఆన్‌లైన్ వ్యవస్థ పెట్టాలన్నది మా ఆలోచన. క్యూబ్ సిస్టమ్ వల్ల కూడా సమస్యలున్నాయి. టికెట్ రేట్లు తెలంగాణలో పెంచారు. ఆంధ్రాలో తగ్గించారు. ఈ సమయంలో అఖండ, పుష్ప చిత్రాలు పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇక ఏపి సిఎంతో జరిగే సమావేశంలో థియేటర్లలో 5 వ షోకు అనుమతిస్తే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందని అడుగనున్నాము. అలాగే నంది అవార్డ్‌లు కూడా ఇవ్వాల్సి ఉంది. సినిమాలకు సబ్సిడీలను ఆశిస్తున్నాము. ఆంధ్ర ,తెలంగాణ ప్రభుత్వాలను సబ్సిడీలను అడుగుతున్నాము. మినీ థియేటర్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపి సిఎం జగన్ చిరంజీవిని పిలిచారు. చిరంజీవి వెళ్తే చిత్ర పరిశ్రమలోని సమస్యల గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఫిలిం ఛాంబర్ కూడా ఉంది. ఇక సినీ ప్రముఖులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తారు. ఏదేమైనా చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది” అని అన్నారు.
చిత్ర పరిశ్రమలోని సమస్యలు పరిష్కారం కావాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -