Monday, January 20, 2025

సిబ్బంది కొరతతో ఇబ్బందులు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఈ రెండు రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఆ శాఖ ఉన్నతాధికారులు నెలరోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారు, ఏసిబి కేసుల్లో ఉన్న వారి వివరాలను ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రూపొందించారు. బదిలీల్లో భాగంగా సోమవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలోని కమిటీ సమావేశమై దీనిపై విస్తృతంగా చర్చించనున్నట్లుగా తెలిసింది.

13 ఏళ్లుగా ఒకేచోట విధులు
ఏసిబి అధికారులకు లంచం తీసుకుంటూ దొరికిన కేసుల్లో రెవెన్యూతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్‌శాఖకు చెందిన సబ్ రిజిస్ట్రార్‌లు ఎక్కువగా ఉండడం కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు బదిలీలపై దృష్టి సారించినట్టుగా సమాచారం. దీంతోపాటు చాలాచోట్ల సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లే ఇన్‌చార్జీలుగా వ్యవహారిస్తుండడంతో అవినీతి ఎక్కువ అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి బది లీ లేకుండా విధులు చక్కబెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరి కొందరైతే ఏకంగా 13 ఏళ్లుగా ఒకేచోట వివిధ హోదాల్లో రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలోని కొన్నిచోట్ల పనిచేసే సబ్ రిజిస్ట్రార్‌లు 7 ఏళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. మాములుగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడేళ్లకోసారి బదిలీలు జరుగుతాయి. కానీ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం చాలామంది సబ్ రిజిస్ట్రార్‌లు 7 నుంచి 10 ఏళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ దిశగా ఉన్నతాధికారులు దీనికి సంబంధించి పూర్తి కసరత్తు చేస్తున్నారు.

ఏటా 19 లక్షలకు పైచిలుకు లావాదేవీలు
141 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సరిపడా సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో కొన్నిచోట్ల సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌లు విధులు నిర్వహిస్తున్నారు.10 సంవత్సరాలుగా పలువురు సబ్ రిజిస్ట్రార్లు పదవీ విరమణ చేశారని, అయినా కొత్తవారు రిక్రూట్‌మెంట్ కాకపోవడంతో సీనియర్ అసిస్టెంట్‌లతో ఆ స్థానాలను భర్తీ చేస్తున్నట్టుగా ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఏటా 19 లక్షల పైచిలుకు పైగా లావాదేవీలు జరుగుతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సిబ్బంది కొరత ప్రస్తుతం ఇబ్బందులను కలిగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ఉద్యోగులు
ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్‌తో కలిపి ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖలో 1400 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా 700 మందికి కూడా పనిచేయడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే పని ఒత్తిడి తట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా సబ్ రిజిస్ట్రార్లు అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులతో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేయించుకుంటున్నారు. అనధికారికంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సబ్ రిజిస్ట్రార్‌లే నెలనెలా జీతం చెల్లిస్తారు. అనధికారికంగా పనిచేసే ప్రైవేటు సిబ్బంది చేతివాటం ఎక్కువగా ప్రదర్శిస్తుండడం వల్లే ఆ శాఖపై అవినీతి అన్న ముద్ర పడిందని అధికారులు పేర్కొంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ల కొరత నేపథ్యంలో అనేకచోట్ల ఏళ్ల తరబడి సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జీలుగా కొనసాగుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News