Wednesday, January 22, 2025

విధి విధానాలు ఖరారు కాలే…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ‘ప్రజా పాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 150 డివిజన్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.

“ప్రజా పాలన’లో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. రేషన్ కార్డులను గత ప్రభుత్వం నిర్లక్షం చేసింది. కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం జరగలేదు. లబ్ధిదారుల ఎంపికకకు నిబంధనలు రూపొందించాల్సి ఉంది. ఆశావహుల డేటా కోసమే దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

ఇందిరమ్మ ఇళ్లు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రజావాణిలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయి’’ అని శ్రీధర్‌బాబు వెల్లడించారు. మరో వైపు ‘ప్రజా పాలన’కు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు కనుక ప్రతి డివిజన్‌లో నాలుగు ప్రాంతాలలో టీం లీడర్‌లను అందుబాటులో ఉంచామన్నారు. టీం లీడర్‌తో పాటు ఏడుగురు సభ్యులు ఉంటారన్నారు. మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక లైను ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వార్డుకు టైం టేబుల్ ఇచ్చామని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు టైం టేబుల్ ఉంటుందని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు ఆ వార్డులలో సమాచారం ఇస్తారన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రతి వార్డుకు ఇంఛార్జీలను కేటాయించామన్నారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మేము ప్రజా సేవకులం : పొన్నం
తాము ప్రజా సేవకులమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చిందని, తాము ఇచ్చిన వాగ్దానాలను నెరవేరు స్తామని తెలిపారు. మీకు స్కీమ్ వర్తిస్తుంది అంటే దరఖాస్తు చేయండి, ప్రతి దరఖాస్తుకు రశీదు ఇస్తామన్నారు. ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారని వెల్లడించారు. మిగతా గ్యారంటీలను ప్రజాపాలనలో తమకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా చేస్తామని పేర్కొంటూ…ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News