ఖమ్మం : నగరంలోని గాంధీచౌక్ శ్రీవరప్రదాత షిర్డిసాయి బాబా మందిరంలో నిర్వహిస్తున్న 13వ వార్షికోత్సవ గురుపౌర్ణమి వేడుకలలో బాగంగా గురువారం తొలిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో వివిధ రకాల పూలతో దీక్షాపరులు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం నగరంలో ప్రధాన వీధుల గుండా సాగింది. దీక్షాపరులు తలపై నవ విధ పరిమళ భరిత సుగంధ పుష్పాల బుట్టలను ధరించి సాయినామస్మరణ చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.
తొలుత ఆలయంలో గణపతి పూజ, మండప ఆరాధన, అనంతరం పుష్పాలతో అర్చన, అభిషేకం, రాత్రి పల్లకి సేవ, మహిళలచే ప్రత్యేక హారతులు, సాయి హారతులు, నీరాజన మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు దంపతులు, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి నిరంజన్ దంపతులు, కోశాధికారి కురువెళ్ల వెంకట జగన్మోహనరావు దంపతులు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.