Friday, February 28, 2025

కేదార్ మృతిపై వీడని మిస్టరీ

- Advertisement -
- Advertisement -

తెలుగు సినీ నిర్మాత కేదార్ మృతి మిస్టరీగా మారింది. అది ఇంకా వీడలేదు. దీంతో మృతదేహం ఇంకా దుబాయ్‌లోనే ఉండిపోయింది. ప్రాథమికంగా గుండెపోటుతో మరణించినట్టు భావించిన దుబాయ్ పోలీసులు, ఆ తర్వాత మృతునికి హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నట్టు సమాచారం అందడంతో అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు తిరిగి ప్రారంభించినట్టు సమాచారం. దీంతో మూడు రోజులుగా కేదార్ మృతదేహాం దుబాయ్‌లోనే ఉండిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే మృతదేహాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్టు దుబాయ్ పోలీసులు చెప్పినట్టు తెలిసింది.

ఇలా ఉండగా ర్యాడిసన్ డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న సెలబ్రిటిలతో ఆయన దుబాయ్‌లో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించడం, అక్కడ ఆస్తులు కొనిపెట్టడంలో కేదార్ మధ్య వర్తిగా వ్యవహరించినట్టు తాజాగా బయటపడింది. ఈ కారణంగా కేదార్ అనుమానాస్పద మృతికి ఈ వ్యాపార లావాదేవీలు ఏమైనా కారణమా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే కేదార్ మృతి చెందిన హోటల్లోనే ఉత్తర తెలంగాణకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్టు కూడా రూడీ అయిందని చెబుతున్నారు.ప్రస్తుతం సదరు మాజీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో కేదార్ ఆకస్మిక మృతిపట్ల అనుమానాలు బలపడుతున్నాయని చెబుతున్నారు.

సినీ ఫైనాన్సర్ ఒకరి ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన కేదార్ ఆదివారం భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించినట్టు కూడా చెబుతున్నారు. అలాగే అక్కడ సోమవారం రాత్రి జరిగిన సినీరంగ ప్రముఖుని విందుకు హాజరైన మంగళవారం తెల్లవారుజామున హోటల్ గదికి చేరుకున్నట్టు చెబుతున్నారు. ఆ తర్వాత నిద్రలోనే కేదార్ విగతజీవిగా అనుమానాస్పదంలో మృతి చెందినట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోనే కేదార్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, ఆ రిపోర్టు వచ్చాకే దానిని హైదరాబాద్‌కు పంపిస్తామని అక్కడి పోలీసులు చెబుతున్నట్టు తెలిసింది. పోస్టుమార్టం రిపోర్టు రావడానికి కొన్ని రోజులు పడుతుందని అప్పటి వరకు అప్పగించేది లేదని దుబాయ్ పోలీసులు చెప్పినట్టుగా తెలిసింది.

’కేదార్’ దోస్తుల్లో గుబులు..!?
కేదార్ ద్వారా దుబాయ్‌లో పలువురు తెలుగు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు వందల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు తెలస్తోంది. వీరికి కేదార్ బినామీగా వ్యవహరిస్తూ వ్యాపారాలు నిర్వహించినట్టు తెలిసింది. కేదార్ ఆకస్మిక మృతితో తమ డబ్బులు పోయినట్టేనన్న భయం పట్టుకున్నట్టు తెలిసింది. తమ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాడనేది వీరికి పూర్తి సమాచారం లేకపోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ పెట్టుబడుల గురించి బయటకి చెప్పుకోలేక టెన్షన్ పడుతున్నట్టు మరొక సమాచారం. ఏది ఏమైనా కేదార్ మృతి మిస్టరీగా మారింది. పైగా దీనికి రాజకీయరంగు పులుముకోవడంతో మున్ముందు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News