తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యర్వంలో ఎగ్జిబిటర్స్ సమావేశం తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో శనివారం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ ఇంకా రీ ఓపెన్ కాలేదు. దీంతో నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు నిర్మాతలు వేచి చూడాలని… ఒకవేళ థియేటర్స్ రీ ఓపెన్ కాకపోయినట్లయితే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేసుకోవాలని ఈ సందర్భంగా నిర్మాతలను కోరారు. ఈ నిర్ణయాన్ని ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలుగు సినీ పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలందరు ఈ విన్నపాన్ని పరిగణించాలని… లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్స్ భవిష్యత్ కార్యాచరణను త్వరలో తెలియజేస్తారని ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ పేర్కొన్నారు. ఇక తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో జనరల్ బాడీ మీటింగ్‌ను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించుకుంది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ మీటింగ్ జరుగనుంది.
Producers will wait till October:Telangana film chamber