ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్‌ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..“ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి” అని చెప్పారు. సీనియర్ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ..“ఈ సినిమా కోసమే నా హెయిర్ స్టైల్ మార్చాను. ఇందులో నాది పాజిటివ్ క్యారెక్టర్” అని పేర్కొన్నారు. నిర్మాత డాక్టర్ లతారాజు మాట్లాడుతూ..“ఈ సినిమాలో కామెడీ, లవ్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా ఉంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో కుశాల్ రాజు, ఫైట్ మాస్టర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.