Saturday, November 2, 2024

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సిలకోసం పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీ, అలీ మస్కతి, జాఫర్ జావీద్, పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. దీంతో ఆయన ఎంఎల్‌సి రేసు నుంచి వైదొలిగారు. త్వరలోనే 54 కార్పొరేషన్లకు ఛైర్మన్లు రేవంత్ సర్కార్ నియమించనుంది . పార్లమెంట్ ఎన్నికల నాటికి నామినేటేడ్ పదవుల భర్తీతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలకపాత్ర
తెలంగాణ ఉద్యమంలో అనేక వర్గాలను, సంఘాలను ఏక తాటిపైకి తీసుకురావడంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ జన సమితిని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో కోదండరామ్‌కు ఎంఎల్‌సి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ మాజీ డిజిపి మహేందర్ రెడ్డిని ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. కొద్ది రోజులుగా కోదండరాంను మండలికి పంపుతారంటూ వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా ఆయన గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి ఎన్నికయ్యారు. కోదండరాంకు ఎంఎల్‌సి పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే శాసనమండలికి పంపడం చర్చనీయాంశంగా మారింది.

2023 జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా సిఫారసు చేసింది. అయితే 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అప్పటి ప్రభుత్వానికి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఇప్పటికే ఎంఎల్‌సిలుగా నియమించింది. ఎంఎల్‌ఎ కోటాల ఎంఎల్‌సిలుగా వారిని మండలికి పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News