మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాని ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తాను ఖండిస్తున్నానని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి డా. కేశవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ సాయిబాబాను సర్వీసు నుంచి టెర్మినేట్ చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా ను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. సాయిబాబా అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశానని ఆయన తెలిపారు. తొంభై శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబాను ఇంకా జైల్లో ఉంచడం ఏ మాత్రం సమంజసం కాదని, ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడంపై తన నిర్ణయాన్ని రాంలాల్ ఆనంద్ కాలేజీ పునఃసమీక్షించుకోవాలని కేశవరావు సూచించారు.
Prof Saibaba terminated by Ram Laal Anand College