ముంబై : దశాబ్దానికి పైగా జైలు జీవితాన్ని గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, హక్కుల ఉద్యమకారుడు జిఎన్ సాయిబాబాకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ) కింద అరెస్టు చేసిన సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ఇతర నిందితులుగా మహేష్ కరిమాన్ టిర్కి, పాండు పొరా నర్కోటె(ఇద్దరూ రైతులు౦, హేమ్ కేశవదత్త మిశ్రా(విద్యార్థి), ప్రశాంత్ బహి సంగ్లికర్ (జర్నలిస్టు), విజయ్ తిర్కి ఉన్నారు. విజయ్ తిర్కికి 10 సంవత్సరాల కారాగార శిక్షను అనుభవిస్తుండగా మిగిలిన నలుగురు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. మరో నింఇతుడు పాండు నర్కోటెకు 2017లో జైలు శిక్ష పడగా 2022 ఆగస్టులో చికిత్స ఆలస్యం కావడంతో జైలులోనే మరణించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని రాం లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబా(57) మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2014 మే 9న మహారాష్ట్ర పోలీసులు ఐపిసి, యుఎపిఎ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. అనేక రుగ్మతలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వీల్ చెయిర్‌కే పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగపూర్‌లోని జైలులో ఉన్నారు. జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్‌ఎ మెనిజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితులపై నమోదైన ఆరోపణలకు తగిన ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్‌విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. యుఎపిఎ కింద నిందితులపై ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాసిక్యూషన్ పొందిన అనుమతి నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. కాగా..2022 అక్టోబర్ 14న జస్టిస్ రోహిత్ దేవ్, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో విచారన ప్రక్రియ చట్ట విరుద్ధమని, యుఎపిఎ కింద చట్టబద్ధమైన అనుమతి కొరవడిందని డివిజన్ బెంచ్ పేర్కొంది. యుఎపిఎ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేనంతవరకు కోర్టు ఈ కేసును పరిగణనలోకి తీసుకోరాదు. అయితే..మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును అదే రోజు ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును తొలుత సుప్రీంకోర్టు నిలుపదల చేసినప్పటికీ 2023 ఏప్రిల్‌లో బొంబాయి హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీలుపై మరోసారి తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీనిపై జస్టిస్ జోషి, జస్టిస్ మెనిజెస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తన నిర్ణయాన్ని తెలియచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించే వరకు రూ. 50,000 చొప్పున బెయిల్ బాండ్లు సమర్పించి నిందితుడిని విడుదల చేయవచ్చని తెలిపింది. కాగా..తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ స్టే కోరలేదు. సాయిబాబాకు, ఐదుగురు ఇతర నిందితులకు నిషిద్ధ వామోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, భారతదేశంపై యుద్ధం సాగిస్తున్నారని పేర్కొంటూ 2017 మార్చి 7న గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు వారిని దోషులుగా తీర్పు చెప్పింది. అనంతరం..నిందితులు ఈ తీర్పును బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్‌లో సవాలు చేశారు. రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్(ఆర్‌డిఎఫ్) కార్యదర్శిగా సాయిబాబా ఉన్నారని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇది నిషిద్ధ కమూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(ఎంఎల్) అనుబంధ సంస్థగా వారు వాదించారు. అయితే సాయిబాబా కుటుంబం మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్టా విడుదల చేయాలని డిమాండు చేస్తోంది.
తీర్పుపై సుప్రీంలో మహారాష్ట్ర సర్కార్ సవాలు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ వెలువరించిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నాగపూర్ బెంచ్ తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే దీన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పదేళ్ల పోరాటం తర్వాత న్యాయం…సాయిబాబా భార్య
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో తన భర్త జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ నిర్దోషిగా విడుదల చేయడంపై ఆయన భార్య వసంత కుమారి హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల పోరాటం తర్వాత న్యాయం లభించిందని ఆమె తెలిపారు. ఈ పోరాట కాలంలో సాయిబాబాకు మద్దతుగా నిలబడిన న్యాయవాదులు, హక్కుల ఉద్యమకారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ప్రతిష్టకు ఎటువంటి కళంకం ఏర్పడలేదని, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారందరూ ఆయనను పూర్తిగా విశ్వసించారని ఆమె అన్నారు. గొప్ప ఉపశమనంగా ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో ఊహించలేమని ఆమె తెలిపారు.
ప్రొఫెసర్ జిఎన్. సాయిబాబా నిర్దోషి
- Advertisement -
- Advertisement -
- Advertisement -